Vandhe Bharath: ఏపీ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు

  • నరసాపురం-బెంగళూరు మధ్య నడిపే ప్రతిపాదన
  • త్వరలో దీనిపై స్పష్టత
  • సికింద్రాబాద్-పూణె మార్గంలోనూ వందేభారత్ స్లీపర్ 
Vandhe Bharath sleeper train will flag off soon from andhra paradesh

తెలుగు రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఏపీలోని నరసాపురం నుంచి బెంగళూరు మధ్య త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు నడిపే ప్రతిపాదన ఉన్నట్టు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు వందే భారత్ రైళ్లు (సిట్టింగ్) నడుస్తుండడం, వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ వస్తుండడం చూస్తూనే ఉన్నాం. విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, విజయవాడ-చెన్నై, కాచిగూడ-యశ్వంత్ ఫూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

దీంతో స్లీపర్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సుముఖంగా ఉంది. ఇందులో భాగంగా వందే భారత్ స్లీపర్ తొలి రైలును ఏపీలోని నరసాపురం నుంచి బెంగళూరుకు నడిపేందుకు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. కాకపోతే వయా ఒంగోలు నుంచా? లేక గుంటూరు నుంచి నడపాలా? అన్నది ఇంకా నిర్ణయించలేదని నరేంద్ర పాటిల్ తెలిపారు. 10 గంటల్లో ఈ రైలు బెంగళూరు చేరుకుంటుందన్నారు. మరోవైపు సికింద్రాబాద్-పూణె మధ్య మరో స్లీపర్ వందేభార్ రైలు సర్వీసు నడిపే ప్రతిపాదన ఉంది. 

వందేభారత్ స్లీపర్ కోచ్ లో ఎన్నో సదుపాయాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇటీవలే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ షేర్ చేయడం తెలిసిందే. ఒక రైలులో 857 బెర్తులు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్ లు కేటాయించనున్నారు.

వందేభారత్ తొలి స్లీపర్ రైలును తన నియోజకవర్గమైన నరసాపురం నుంచి ప్రారంభిస్తున్నందుకు ఎంపీ రఘురామకృష్ణరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు గాను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్, రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. 

More Telugu News