దేశంలో ఆకలి కేకలంటూ అంతర్జాతీయ నివేదిక.. భారత్ గుస్సా!
- గురువారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదల
- జాబితాలోని 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం
- భారత్ కంటే మెరుగ్గా పాక్(102), బంగ్లాదేశ్(81), నేపాల్(69), శ్రీలంక(60)
- గతేడాది 121 దేశాల్లో భారత్‌కు 107వ స్థానం
ఈ నివేదిక ప్రకారం, భారత్‌లో చిన్నారులు పోషకాహార లోపంతో కూడా సతమతమవుతున్నారు. ఇది ఏకంగా 18.7 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. దేశంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. అలాగే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో రక్తహీనత 58.1 శాతంగా ఉంది.
మరోవైపు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో దాయాదిదేశం పాక్ 102వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ 81వ స్థానం, నేపాల్ 69వ స్థానం, శ్రీలంక 60వ స్థానంలో.. భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది.
నివేదికను తోసిపుచ్చిన కేంద్రం
భారత్‌లో ఆకలి కేకలు నెలకొన్నాయన్న గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ కొలమానం భారత్‌కు అనువైనది కాదని పేర్కొంది. దేశంలోని వాస్తవ పరిస్థితులను ఇది ప్రతిబింబించడం లేదని తేల్చి చెప్పింది. ఈ సూచిక మదింపులో ఉపయోగించిన నాలుగు ప్రాతిపదికల్లో మూడు చిన్నారులకు సంబంధించినవని, కాబట్టి ఇది యావత్ దేశంలోని సగటు పరిస్థితులను ప్రతిబింబించలేదని వివరించింది.