Revanth Reddy: మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదు: రేవంత్ రెడ్డి

Revanth Reddy interesting comments on congess list
  • కాంగ్రెస్‌కు సాయం చేస్తున్న 75 మంది లిస్ట్‌ను కేటీఆర్ కేంద్రమంత్రికి ఇచ్చినట్లుగా సమాచారం ఉందన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న పదవులు కాంగ్రెస్, సోనియా బిక్ష అన్న టీపీసీసీ చీఫ్
  • తాను భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమన్న రేవంత్
  • అభ్యర్థుల ప్రకటన ఎప్పుడనేది తన చేతుల్లో లేదని ఆసక్తికర వ్యాఖ్య
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది అధికారుల లిస్టును కేటీఆర్ తయారు చేసి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది అధికారులను కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ 45 రోజులు అకుంఠిత దీక్షతో పని చేస్తే అధికారం మనదే అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని, ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సంతకం ఖాయమన్నారు.

తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని, కాంగ్రెస్ ఏం చేసిందంటూ బావాబామ్మర్దులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఆయన కుటుంబం అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన బిక్ష అన్నారు. సోనియా గాంధీ దయతో వారికి మంత్రి పదవులు దక్కాయన్నారు. కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని తొమ్మిదేళ్లు ఎదురు చూశారని, కానీ తెలంగాణ ప్రజలను, సోనియాను మోసం చేశారన్నారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌ల వలె మాట్లాడుతున్నారని విమర్శించారు.

తనను భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయమంటున్నారని, తాను అందుకు సిద్ధమని, మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోన్న తెలంగాణ డీజీపీని తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారన్నారు. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పోలీసులను హెచ్చరిస్తున్నానని, కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు.

బిడ్డా కేటీఆర్... గుర్తు పెట్టుకో.. నీ అధికారం ఇంకా 45 రోజులే. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మేం వచ్చిన వెంటనే ఇప్పుడు చేసిన దానికి మిత్తితో చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించాలని, బీఆర్ఎస్ కార్యకర్తల్లా వేధించవద్దన్నారు.

అభ్యర్థుల ప్రకటన నా చేతుల్లో లేదు

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుందని రేవంత్ చెప్పారు. అందరినీ అందుబాటులో ఉండాలని చెప్పారని, కాబట్టి ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు అనేది తన చేతుల్లో లేదన్నారు. ఎన్నికల కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకుందని, నివేదికలు, సర్వేల పరిశీలన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
Revanth Reddy
Congress
BRS
Telangana Assembly Election

More Telugu News