Gautam Gambhir: కోహ్లీ చర్య తనను ఆకట్టుకుందన్న గంభీర్

  • గత ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ, నవీనుల్ హక్ మధ్య గొడవ
  • నవీనుల్ హక్ ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్
  • నిన్న ఢిల్లీలోనూ నవీనుల్ హక్ ను ఉద్దేశించి నినాదాలు
  • సంయమనంతో వ్యవహరించాలని ప్రేక్షకులకు సంజ్ఞలు చేసిన కోహ్లీ
  • కోహ్లీ వైఖరిని కొనియాడిన గంభీర్
Gambhir prises Kohli gesture in Delhi Arun Jaitley stadium

టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య నిన్న ఢిల్లీలో వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్ తమ పాత వివాదానికి స్వస్తి పలికి స్నేహభావంతో మెలిగారు. ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని, అభిమానులకు స్పష్టమైన సందేశం పంపారు. 

అంతకుముందు, మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కోహ్లీతో నవీనుల్ హక్ గొడవను దృష్టిలో ఉంచుకున్న ప్రేక్షకులు... కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నవీనుల్ హక్ ను ఉద్దేశించి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో, కోహ్లీ జోక్యం చేసుకుని, కూల్ గా ఉండాలంటూ ప్రేక్షకులకు సంజ్ఞలు చేశాడు. ప్రేక్షకుల గ్యాలరీ వైపు తిరిగి ఎలాంటి నినాదాలు చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 

ఈ ఘట్టంపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. "నిజంగా అది చాలా గొప్ప చర్య. ఇక నుంచి వరల్డ్ కప్ లో రాబోయే మ్యాచ్ ల్లో వీక్షకులు కోహ్లీ చర్యను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. దేశం కోసం ఆడాలని, ఐపీఎల్ లో ఆడాలని ప్రతి ప్రొఫెషనల్ క్రికెటర్ ఎంతో కఠోరంగా శ్రమిస్తారు. మైదానంలో స్పర్ధలు మామూలే. 

మీరు ఎవరికైనా మద్దతు ఇవ్వకపోయినా ఫర్వాలేదు... విమర్శించొద్దు. మీకిష్టమైన ఆటగాడికి మద్దతు ఇచ్చే హక్కు మీకు ఉంటుంది. కానీ ఓ ఆటగాడ్ని విమర్శించే హక్కు మీకు లేదు" అని గంభీర్ ప్రేక్షకులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. 

"నాడు ఐపీఎల్ లో కోహ్లీ, నవీనుల్ హక్ మధ్య ఏం జరిగిందో నిన్న ఢిల్లీ మైదానంలో నినాదాలు చేసిన ప్రేక్షకుల్లో చాలామందికి తెలియదు. అసలేం జరిగిందన్నది ఆ ఇద్దరు ఆటగాళ్లు, వారి టీమ్ మేనేజ్ మెంట్లకు మాత్రమే తెలుసు. విదేశీ జట్లు, విదేశీ ఆటగాళ్లు మన దేశానికి వచ్చి ఆడుతున్నప్పుడు వాళ్లు మన అతిథులు. మనం వాళ్లను గౌరవించాలి. ప్రేక్షకులు క్రికెటర్లకు మరింత మద్దతు ఇవ్వడం ద్వారా సౌహార్ద్ర రాయబారులుగా వ్యవహరించాలి" అని గంభీర్ పిలుపునిచ్చారు.

More Telugu News