Vijayasai Reddy: అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy tweets to Purandeswari
  • మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడన్న విజయసాయి
  • 13 సార్లు సంతకాలు కూడా పెట్టాడని ట్వీట్
  • స్కిల్ కేసులో ఈడీ అరెస్టులు కూడా చేసిందని వ్యాఖ్య
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ యువనేత నారా లోకేశ్ తో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసిన సంగతి తెలిసిందే. తమపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి అమిత్ షాకు లోకేశ్ వివరించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు పురందేశ్వరిని టార్గెట్ చేస్తున్నారు. పురందేశ్వరిని ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 

'అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. 

ఒక ఫేక్‌ అగ్రిమెంట్‌తో స్కిల్‌ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్‌ అని సీమెన్స్‌ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఆ అగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది. ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్‌మెంట్‌లో చెప్పింది. 

సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా ఎలా రూట్‌ చేశారో స్వయంగా బాబు పీఏ వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా రూ. 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తరవాత షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది' అని విజయసాయి అన్నారు.
Vijayasai Reddy
YSRCP
Daggubati Purandeswari
BJP

More Telugu News