Telangana: ఈసీ హుకుం: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సహా ముగ్గురు సీపీల బదిలీ

EC orders transfers of key higher officials in Telangana ahead of general elections
  • ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక చర్యలు
  • ముగ్గురు సీపీలు, నలుగురు జిల్లా కలెక్టర్లు, 10 మంది జిల్లా ఎస్పీల బదిలీ
  • వాణిజ్య పన్నుల శాఖకు, ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ముఖ్య కార్యదర్శులను నియమించాలని ఆదేశం
  • తెలంగాణతో పాటూ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం బదిలీలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం కలిగించింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల కమిషనర్‌నూ ఈసీ పక్కన పెట్టేసింది.

స్థాన చలనం కలిగిన వారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. హరీశ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ డి. అమోయ్ కుమార్, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటూ 10 జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. వీరిలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, మహబూబాబాద్‌-చంద్రమోహన్‌, భూపాలపల్లి-కరుణాకర్‌, మహబూబ్‌నగర్‌-నర్సింహ, నారాయణపేట-వెంకటేశ్వర్లు, సంగారెడ్డి- రమణకుమార్‌, కామారెడ్డి- శ్రీనివాస్ రెడ్డి, నాగర్‌కర్నూల్‌-మనోహర్‌, జగిత్యాల-భాస్కర్‌, గద్వాల్‌-సృజన ఉన్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్‌, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌-ఎండీ ముషారఫ్‌ అలీ ఫరూఖీ, రవాణా శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజులను కూడా బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. 

అంతేకాకుండా, వాణిజ్య పన్నుల శాఖకు, ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ముఖ్య కార్యదర్శులను నియమించాలని కూడా పేర్కొంది. తెలంగాణతో పాటూ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికార బీఆర్ఎస్‌కు కొందరు వంత పాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఇదే తరహా ఫిర్యాదు చేశారు.
Telangana
Election Commission Of India
Congress
BJP
BRS

More Telugu News