Nara Lokesh: సాక్షి ప్రతినిధికి నారా లోకేశ్ చురకలు

  • హెరిటేజ్ 1992లో ప్రారంభమైందని, 1994లో లిస్టింగ్ అయిందన్న నారా లోకేశ్
  • హెరిటేజ్‌కు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ డొమైన్‌లో ఉన్నాయని వెల్లడి
  • పది రూపాయల షేర్‌ను దొడ్డిదారిన రూ.350గా చేయలేదని ఎద్దేవా 
Nara Lokesh satires on Sakshi reporter

సాక్షి ప్రతినిధికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రెండో రోజైన బుధవారం సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధి వేసిన ప్రశ్నకు ఆయన ఓపికగానే కౌంటర్ ఇచ్చారు. ఏంటమ్మా... చెప్పమ్మా సాక్షి, ఏమో సాక్షి కదా... నీకు జీతం ఎక్కువ కడుతున్నారట కదా, మీ జీతాలు పెరిగాయా లేదా చెప్పు అని ప్రశ్నించారు.

హెరిటేజ్ గురించి ప్రశ్నించగా... బ్రదర్ అలా అనవద్దు, అనవసర ఆరోపణలు చేయవద్దు అంటూ సాక్షి ప్రతినిధిని ఉద్దేశించి అన్నారు. హెరిటేజ్ సంస్థ 1992లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభమైందని, 1994లోనే లిస్టింగ్ అయిందని చెప్పారు. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయన్నారు.

పది రూపాయల షేర్‌ను దొడ్డిదారిన రూ.350కి చేయలేదని సాక్షి మీడియాను ఉద్దేశించి అన్నారు. తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు. అవసరమైతే వెళ్లి భారతిరెడ్డిని అడుగు అని చురకలు అంటించారు. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.350గా చేశారని సాక్షిపై విమర్శలు చేశారు. 

ప్రజాధనాన్ని లూటీ చేసి సాక్షి ఛానల్ అందరికంటే ఎక్కువ రేటింగ్ వేయించుకుంటోందని మండిపడ్డారు. వాలంటీర్లకు జీవో జారీ చేసి మరీ సాక్షి పేపర్ కొనాలని చెప్పారన్నారు. అందుకే జగన్‌కు, భారతి రెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఇది తెలుసుకో బ్రదర్ అని వ్యాఖ్యానించారు.

లింగమనేని ఇల్లుపై అడిగిన ప్రశ్నకు కూడా కౌంటర్ ఇచ్చారు. లింగమనేని ఇల్లు మీకు ఎందుకు ఇచ్చారని సాక్షి ప్రతినిధి అడిగారు. దానికి లోకేశ్ స్పందిస్తూ... మేం క్విడ్ ప్రోకో కింద తీసుకోలేదని, దానికి న్యాయబద్ధంగా అద్దె చెల్లించామని చెప్పారు. అద్దె చెల్లించకుంటే క్విడ్ ప్రోకో అవుతుందని, కానీ చెల్లించాక క్విడ్ ప్రోకో ఎక్కడిది అన్నారు. రూ.10 ముఖ విలువ కలిగిన సాక్షి పత్రిక షేర్‌ను రూ.350కి కొంటే క్విడ్ ప్రోకో అవుతుందని చురకలు అంటించారు.

More Telugu News