Team India: ఆఫ్ఘనిస్థాన్ ను అలవోకగా ఓడించిన రోహిత్ సేన

  • వరల్డ్ కప్ లో టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
  • 8 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ
  • 273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలో ఛేదించిన రోహిత్ సేన
  • రోహిత్ శర్మ సెంచరీ, కోహ్లీ అర్ధసెంచరీ... రాణించిన కిషన్, శ్రేయాస్ 
  • టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసిన టీమిండియా
Team India gets easy victory over Afghanistan

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఇవాళ ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ సునాయాసంగా గెలిచింది. ఆఫ్ఘన్ జట్టు నిర్దేశించిన 273 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కేవలం 35 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక సెంచరీతో భారత్ విజయానికి బాటలు వేశాడు. రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ దాడులను తుత్తునియలు చేసిన హిట్ మ్యాన్ ఏకంగా 16 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా రోహిత్ వశమయ్యాయి. 

మరో ఎండ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 47 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సెంచరీ అనంతరం రోహిత్ శర్మ కూడా అవుటైనప్పటికీ, విరాట్ కోహ్లీ (55 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (25 నాటౌట్) మరో వికెట్ పడకుండా టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు 2 వికెట్లు తీశాడు. 

ఇవాళ్టి మ్యాచ్ లో మరో ఆసక్తికర దృశ్యం కూడా కనిపించింది. ఐపీఎల్  సందర్భంగా తీవ్ర స్థాయిలో మాటలు విసురుకున్న ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్, టీమిండియా మాజీ సారథి కోహ్లీ హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఇరువురు గత వివాదానికి ముగింపు పలికారు. 

కాగా, వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ ను ఆసీస్ తో ఆడిన భారత్ ఆ మ్యాచ్ లోనూ గెలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా వరల్డ్ కప్ లో తన తదుపరి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అక్టోబరు 14న ఆడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ రసవత్తర పోరుకు వేదికగా నిలవనుంది.

More Telugu News