Sajjala Ramakrishna Reddy: నెలరోజులుగా చంద్రబాబు, ఆయన లాయర్లు ఆ సింగిల్ పాయింట్ మీదే మాట్లాడుతున్నారు: సజ్జల

  • కక్ష సాధింపు అంటున్నారు తప్ప నేరం చేయలేదని టీడీపీ నేతలు చెప్పడం లేదన్న సజ్జల
  • పూర్తి ఆధారాలతో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందన్న ప్రభుత్వ సలహాదారు
  • నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్న
  • నెల రోజులుగా వారు క్వాష్ పిటిషన్‌పైనే మాట్లాడుతున్నారని విమర్శ
Sajjala blames chandrababu naidu for quash petition

చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ కక్ష సాధింపుతో చేశారని చెప్పడం తప్ప, నేరం జరగలేదని మాత్రం వారు ఎక్కడా చెప్పడం లేదని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును పూర్తి ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. అలాంటప్పుడు కక్ష సాధింపు చర్య ఎక్కడ? అని ప్రశ్నించారు. వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారన్నారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారన్నారు. సీమెన్స్ కూడా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమకు సంబంధం లేదని తెలిపింది. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులను పక్కదారి పట్టించారన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారన్నారు. ఈ కుంభకోణంలో పాత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే అన్నారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రూ.300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని టీడీపీ అధినేత దుర్వినియోగం చేశారన్నారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారన్నారు. స్కిల్ కేసును విచారణ చేయాలని భావించిన సీఐడీ ఆ దిశగా విచారించిందన్నారు. కోర్టు కూడా చంద్రబాబు తప్పు చేశారని భావించి జ్యూడిషియల్ రిమాండ్ విధించిందన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు లాయర్లు నెల రోజులుగా క్వాష్ మీదనే మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబుకు తెలిసింది అదేనని, అందుకే నెల రోజులుగా సింగిల్ పాయింట్ క్వాష్ మీద మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు తెలిసిన ఏకైక విద్య విచారణకు రాకుండా కప్పేయడమే అన్నారు. ప్రతి కేసులో ఏదో టెక్నికల్ కారణంతో కేసును నిలిపివేస్తున్నారన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు మాజీ సీఎం అని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగారని, అలాంటి వ్యక్తి ఎందులోనూ దొరకలేదని, కానీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అడ్డంగా దొరికారని వ్యాఖ్యానించారు.

More Telugu News