Kodali Nani: అందుకే చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటిషన్లను కోర్టులు కొట్టేశాయి!: కొడాలి నాని

  • చంద్రబాబు పాపాలు పండాయి, ఇప్పుడు బయటపడ్డాయి కాబట్టి అరెస్టయ్యాడన్న నాని
  • చంద్రబాబు దోపిడీని కోర్టులు నమ్మాయి కాబట్టే బెయిల్, క్వాష్ పిటిషన్లను కొట్టేశాయన్న మాజీ మంత్రి
  • తన జీవితంలో 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారన్న కొడాలి నాని
  • హెరిటేజ్ ఆస్తుల విలువ రూ.20వేల కోట్లని భువనేశ్వరే చెప్పారన్న వైసీపీ నేత
  • చంద్రబాబుకు కొండాపూర్, మాదాపూర్, అమరావతి, సింగపూర్, దుబాయ్‌లలో ఆస్తులు
Kodali Nani alleges chandrababu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు పాపాలు పండాయని, ఇప్పుడు అవి బయటపడ్డాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసును క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నారు. కానీ టెక్నికల్ అంశాలతో ఆయనకు రిలీఫ్ దొరకదన్నారు. కక్ష సాధింపు అనడానికి తాము అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో ఆయనను జైల్లో పెట్టలేదన్నారు. చంద్రబాబు దోపిడీకి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించినట్లు చెప్పారు. ఆయన ప్రమేయం తేలాకే అరెస్ట్ జరిగిందన్నారు.

చంద్రబాబు దోపిడీని కోర్టులు కూడా నమ్మాయని, అందుకే ముందస్తు బెయిల్స్, క్వాష్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయన్నారు. 17ఏ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన న్యాయవాదులూ అదే చెబుతున్నారని, కానీ తప్పు చేయలేదని చెప్పడం లేదన్నారు. తన జీవితంలో పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 2016లోనే సీఐడీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందన్నారు. కానీ అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడని, అందుకే ఆపుకుంటూ వచ్చారన్నారు.

చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించి, ఇన్నివేల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలన్నారు. హెరిటేజ్‌లో రెండు శాతం షేర్లు అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పారని, అంటే ఈ ఆస్తుల విలువ రూ.20వేల కోట్లు అని ఆమె స్వయంగా చెప్పారన్నారు. హెరిటేజ్‌లో రూ.20వేల కోట్ల వైట్ మనీ ఉంటే, రూ.70వేల కోట్లు బ్లాక్ మనీ ఉంటుందన్నారు. చంద్రబాబుకు కొండాపూర్, మాదాపూర్, అమరావతి, సింగపూర్, దుబాయ్ లలో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు.

వినేవాడు ఎవరైనా ఉంటే చంద్రబాబు హరికథను ఇంగ్లీష్ లో కూడా చెబుతారని ఎద్దేవా చేశారు. ఏపీలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబే అన్నారు. రెండెకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలన్నారు. తన పద్నాలుగేళ్ల పరిపాలన చూసి ఓటేయమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? నేను మంచి చేశానని నమ్మితే ఓటేయమని అడిగే దమ్ము జగన్‌కు ఉంది అని సవాల్ చేశారు.

More Telugu News