Pradeep Eshwar: విమర్శలకు భయపడి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • ఆదివారం నాడు ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ 10వ సీజన్
  • బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్
  • ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర విమర్శలు
  • కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకే వచ్చానని ఎమ్మెల్యే వివరణ
Karnataka Congrees MLA leaves Bigg Boss show after severe criticism

కన్నడ బిగ్ బాస్ సీజన్-10లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొనడం ఏంటని ప్రదీప్ ఈశ్వర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కర్ణాటక అధికార పక్షం కాంగ్రెస్ ఈ విమర్శలకు జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చేశారు. తాను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లింది కంటెస్టెంట్లను ఉత్సాహపరిచేందుకేనని ప్రదీప్ ఈశ్వర్ మీడియాకు వివరణ ఇచ్చారు. తాను కేవలం మూడు గంటల సమయం గడిపేందుకే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లానని స్పష్టం చేశారు. 

"బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకుల ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమానికి విచ్చేశాను. యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఈ షోలో పాల్గొన్నాను. అయితే కొందరు నన్ను విమర్శించారు... అది వాళ్ల ఇష్టం" అని ప్రదీప్ ఈశ్వర్ పేర్కొన్నారు. 

కాగా, ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్ బాస్ షో 10వ సీజన్ లో పాల్గొనడం పట్ల కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కు వందేమాతరం సామాజిక సేవా సంస్థ ఫిర్యాదు చేసింది. సదరు ఎమ్మెల్యేపై వేటు వేయాలని స్పీకర్ ను కోరింది. 

ప్రదీప్ ఈశ్వర్ ఇటీవలి ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా పనిచేసిన కె.సుధాకర్ ను ఓడించడంతో కాంగ్రెస్ వర్గాల్లో ప్రదీప్ ఈశ్వర్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది.

More Telugu News