Fire Accident: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు... 10 మంది దుర్మరణం

  • అరియలూరు జిల్లాలో ఘటన
  • ఉదయం కార్మికులు అల్పాహారం తీసుకుంటుండగా ప్రమాదం
  • మంటల్లో చిక్కుకుపోయిన కార్మికులు
  • ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి చెందిన సీఎం స్టాలిన్
  • మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం
Huge fire accident in fire works factory in Tamil Nadu leaves 10 dead

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. అరియలూరు జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో కార్మికులు అల్పాహారం తీసుకుంటున్నారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో వారంతా కర్మాగారంలోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. 

ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే బాణసంచా కర్మాగారం వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు శ్రమించారు. బాణసంచా తయారీ కేంద్రం లోపల చిక్కుకున్న కార్మికులను స్థానికుల సాయంతో బయటికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. 

వెట్రియూర్ కు చెందిన రాజేంద్రన్ ఈ బాణసంచా కర్మాగారం యజమాని. పదేళ్ల కిందట ఈ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. కాగా, బాణసంచా కర్మాగారంలో పేలుడు ఎందుకు జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు. 

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రగాయాలపాలైన వారికి రూ.1 లక్ష, ఓ మోస్తరు గాయాలకు గురైనవారికి రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

More Telugu News