G. Kishan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం: కిషన్ రెడ్డి

  • తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన తుడిచిపెట్టుకుపోవాలని పిలుపు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు, మూడు స్థానాలకు పోటీ పడాలన్న కిషన్ రెడ్డి
  • కేసీఆర్ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి ఎన్నికలకు వెళ్తున్నారని వ్యాఖ్య
Kishan Reddy says bjp will win telangana elections

బీజేపీ పాత్ర లేకుండా తెలంగాణ లేదని, తమ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన తుడిచిపెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. అధికారం తమదేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడాల్సిందే అన్నారు. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణలో సకల జనుల పాలన రావాలని, అది బీజేపీతోనే సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రేపు అదిలాబాద్ లో బహిరంగ సభ జరగనుందన్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఎంపీ, ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా అమ్ముతున్నారన్నారు. ఎన్నికలను డబ్బుమయం చేసింది కేసీఆరే అన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తమకు ఓటేస్తేనే దళితబంధు, పెన్షన్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

More Telugu News