Anitha: ఈ సినీ ప్రముఖులు రోజా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: వంగలపూడి అనిత

  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారని నిలదీత
  • పవన్ కల్యాణ్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్న
  • రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఏం చేశారన్న వంగలపూడి అనిత
Vangalapudi Anitha questions who supports roja

మంత్రి ఆర్కే రోజాపై తమ పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల మీద పలువురు సినీ ప్రముఖులు స్పందించడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం తెలుసునని వారు మాట్లాడుతున్నారని నిలదీశారు. ఆ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్యను అన్నప్పుడు వీరెవరూ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. రోజా చరిత్ర ఏమిటో తెలుసుకొని మాట్లాడితే మంచిదని లేదంటే ప్రజల నుంచి చీత్కారాలు తప్పవన్నారు.

రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఇదే సినీ ప్రముఖులు ఎందుకు స్పందించలేదు? అని అడిగారు. టీడీపీ, జనసేన నేతల కుటుంబ సభ్యులపై కూడా రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యల మీద ఖుష్బూ, రమ్యకృష్ణ, రాధిక తదితరులు స్పందించిన విషయం తెలిసిందే.

అనిత ఇంకా మాట్లాడుతూ... మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారన్నారు. మద్యం ద్వారా పేద ప్రజల నుంచి ఈ నాలుగేళ్లలో రూ.94,000 కోట్లు దోచుకున్నారన్నారు. జే బ్రాండ్స్ మద్యంలో విషతుల్యాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ నిరూపించిందని, కానీ అలా చేసినందుకు తమపైనే కేసులు పెట్టారన్నారు. మద్యం బ్రాండ్స్ వల్ల నాలుగున్నరేళ్ల కాలంలో తాగిన వారి కాలేయం చెడిపోతోందన్నారు. ఓ వైపు జనాలను రోగాల బారిన పడేస్తూ మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటికి డాక్టర్ అంటున్నారని ఎద్దేవా చేశారు.

నాసిరకం మద్యం ద్వారా ప్రజల ప్రాణాలను తీస్తున్నారన్నారు. మద్య నిషేధం అమలు చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమపథకాలు అమలు చేస్తారా? అని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఏపీలో చంద్రబాబు హయాంలో హ్యాపీ ఇండెక్స్ ఉంటే, జగన్ హయాంలో స్ట్రెస్ ఇండెక్స్ ఉందని ఎద్దేవా చేశారు. మద్యం కారణంగా ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. మద్యపాన నిషేధం అమలు చేయనప్పుడు నవరత్నాల స్టిక్కర్‌లో మద్యపాన నిషేధం ఎందుకో చెప్పాలన్నారు.

More Telugu News