Over speeding: టర్నింగ్ లో ఓవర్ స్పీడ్ వద్దు.. వీడియోతో సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

  • మలుపులోనూ వేగంగా దూసుకు పోయిన బైకర్
  • పిట్ట గోడను ఢీకొట్టి కింద పడిపోయిన వైనం
  • సూరత్ పట్టణంలో చోటు చేసుకున్న ఘటన
Cyberabad traffic police shares video of Implications of Over speeding at curve

ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానం చేరాలంటూ పోలీసులు పదే పదే ఆడియో సందేశాలతో ప్రచారం చేస్తుంటారు. అయినప్పటికీ, చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పట్టనట్టు వ్యవహరిస్తుంటారు. పట్టణ రహదారులపై 80, 100 కిలోమీటర్లకు పైగా వేగంగా దూసుకుపోయే బైక్ లు, కార్లు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. చివరికి పై వంతెనలపైనా అదే వేగంగా బైకర్లు డ్రైవింగ్ చేస్తుంటారు. కొంచెం స్థలం కనిపించినా చేప పిల్లల మాదిరిగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు.

అలాంటి రేసర్లకు ఏది అడ్డొచ్చినా ఏమీ పట్టదు. మూల మలుపుల్లోనూ ప్రమాదకరంగా అంతే వేగంగా వెళుతుంటారు. ముఖ్యంగా మలుపుల్లో పరిమితి మించి వేగంగా వెళ్లడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయన్న దానికి ఈ వీడియోనే ప్రబల నిదర్శనం. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోని తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి, అతివేగం, అత్యంత ప్రమాదకరమనే సందేశాన్ని వాహనదారులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. 

సూరత్ పట్టణంలో ఫ్లై ఓవర్ పై ఓ బైక్ రేసర్.. మలుపులో వేగం తగ్గించకుండా కారును ఓవర్ టేక్ చేసి ముందుకు పోవడంతో అది కాస్తా అదుపుతప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. పిట్ట గోడపై వాహనదారుడు పడిపోయాడు. ఇంకొంచెం బ్యాలన్స్ తప్పితే వంతెన మీద నుంచి కింద పడి మరణించే వాడే. కానీ, అదృష్టవశాత్తూ క్షేమంగా బయటబడ్డాడు. వెనుక కారుకున్న కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. ఇలాంటి ప్రమాదాలే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రెండు చోటు చేసుకున్నాయి. రెండు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కనుక పరిమిత వేగంతో వెళ్లడమే క్షేమకరమని వాహనదారులు ఈ వీడియో చూసి అయినా గుర్తించాలి.

More Telugu News