Payment Gateway: సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్! పేమెంట్ గేట్‌వే సంస్థ నుంచి రూ.16 వేల కోట్ల చోరీ

  • హ్యాకర్లు రూ.25 కోట్లు తస్కరించారంటూ థానే పోలీసులకు ఓ చెల్లింపుల సంస్థ ఫిర్యాదు
  • దర్యాప్తు సందర్భంగా వెలుగులోకొచ్చిన భారీ మొత్తం 
  • ఇప్పటివరకూ హ్యాకర్లు రూ.16 వేల కోట్లు దొంగిలించినట్టు గుర్తించిన పోలీసులు
  • ఐదుగురిపై కేసు నమోదు, నిందితుల నుంచి ఫోర్జరీ డాక్యుమెంట్ల స్వాధీనం
Payment gateway company account hacked in Thane rs16180 crore siphoned off

మహారాష్ట్రలో తాజాగా ఓ భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ పేమెంట్ గేట్‌వే సంస్థ నుంచి నేరగాళ్లు రూ.16,180 కోట్లు కాజేసినట్టు వెల్లడైంది. తమ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ సదరు సంస్థ ఏప్రిల్‌లో థానే నగరంలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొత్తం రూ.25 కోట్లు పోగొట్టుకున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా ఈ మోసం సుదీర్ఘకాలంగా జరుగుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇప్పటివరకూ రూ.16,180 వేల కోట్లు కాజేసినట్టు వెల్లడైంది. 

ఈ క్రమంలో ఐదుగురిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసులో నిందితుడిగా ఉన్న జితేంద్ర సింగ్ గతంలో పదేళ్ల పాటు వివిధ బ్యాంకుల్లో రిలేషన్‌షిప్, సేల్స్ మేనేజర్‌గా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. 

కాగా, ఈ భారీ మోసంలో వివిధ వ్యక్తుల పాత్ర ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. వివిధ కంపెనీలు, వ్యక్తులు నిందితుల బారిన పడి ఉండొచ్చని అంటున్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఈ సైబర్ స్కామ్‌లో వేల అకౌంట్ల మధ్య నగదు బదిలీ జరిగింది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వద్ద ఫోర్జరీ చేసిన పలు డాక్యుమెంట్లు కూడా పోలీసులకు లభించాయి. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News