Chiranjeevi: కొన్ని వార్తల కారణంగా నేను కలత చెందిన సందర్భాలు ఉన్నాయి: చిరంజీవి

  • 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
  • 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకాన్ని అక్షరబద్ధం చేసిన వినాయకరావు
  • చిరంజీవి నివాసంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
Chiranjeevi launches Telugu Cine Patrikeya Charitra book

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించారు. భారతీయ తొలి సినీ పత్రిక విశేషాలు, నాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ హైదరాబాదులోని చిరంజీవి నివాసంలో జరిగింది. పుస్తకావిష్కరణ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర ప్రసంగం చేశారు. 


జర్నలిస్టుల పెన్ పవర్ అంతా ఇంతా కాదు!

తన కెరీర్ ఆరంభం నుంచి సినీ పాత్రికేయులతో, రచయితలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని చిరంజీవి అన్నారు. జర్నలిస్టుల పెన్ కు ఉన్న పవర్ అంతా ఇంతా కాదని, దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చని తెలిపారు. ఒక్కోసారి జర్నలిస్టులు రాసే వార్తలు వాస్తవానికి దూరంగా ఉంటూ దుమారం సృష్టిస్తుంటాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వార్తల కారణంగా తాను కూడా కలత చెందిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడో వచ్చిన ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండడం బాధాకరం అని చిరంజీవి పేర్కొన్నారు.

ఆ అలవాటు నేటికీ ఉంది!

సినిమా చర్చల్లో తాను దర్శకులు, నిర్మాతలతో కూర్చుని మాట్లాడినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రచయితలతో కూర్చుని సంభాషిస్తుంటానని చిరంజీవి వెల్లడించారు. గతంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్ వంటి వారితో తరచుగా మాట్లాడేవాడినని, అదే అలవాటు నేటికీ ఉందని చెప్పారు. రచయితలకు, పాత్రికేయులకు తన హృదయంలో ప్రత్యేకస్థానం ఉందని అన్నారు. సందర్భానుసారం వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయాలన్న ఉద్దేశంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయని చిరంజీవి తెలిపారు.

ఏ అంశంపై అయినా లోతుల్లోకి వెళ్లి రాస్తుంటాడు!

'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తక రచయిత వినాయకరావుపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం వినాయకరావుకు అలవాటు అని తెలిపారు. అలాగే, వినాయకరావు అరుదైన ఫొటోలు సేకరిస్తుంటాడని, భావితరాలను దృష్టిలో ఉంచుకుని అతడు చేసే ప్రయత్నం అభినందనీయం అని పేర్కొన్నారు. వినాయకరావు... ఎన్టీఆర్, దాసరి, కృష్ణ గురించి పలు పుస్తకాలు రాశాడని, తన గురించి కూడా పుస్తకం రాశాడని చిరంజీవి వెల్లడించారు. ఇలాంటి వాళ్లు పుస్తకాలు రాసే ప్రయత్నాన్ని మానుకోకూడదని అన్నారు. 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకాన్ని తాను కూడా కొంటున్నానని చిరంజీవి తెలిపారు.

More Telugu News