AP Fibernet: 'ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు - జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు' పుస్తకాన్ని విడుదల చేసిన టీడీపీ

  • చంద్రబాబు, లోకేశ్ పై ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలోనూ ఆరోపణలు
  • దీటుగా స్పందించిన టీడీపీ... ఫైబర్ నెట్ పై పూర్తి వివరాలతో పుస్తకం 
  • చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదన్న పయ్యావుల
  • ఆ విషయం జగన్ కు కూడా తెలుసని వెల్లడి
  • రాజకీయ కుట్ర అంటూ విమర్శలు
TDP releases book on AP Fibernet project

టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ దీటుగా స్పందించింది. 'ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు' పేరిట ఓ పుస్తకాన్ని తీసుకువచ్చింది. 

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఆయనకు అవినీతి మరక అంటుకునే అవకాశమే లేదని అన్నారు. 

చంద్రబాబును అరెస్ట్ చేసి 30 రోజులవుతోంది... కనీసం ఒక్క పైసా అవినీతి జరిగినట్టు కూడా నిరూపించలేకపోయారు అని పయ్యావుల విమర్శించారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని సీఎం జగన్ కు, మిగతా వారికి కూడా తెలుసని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజల్లో చంద్రబాబుకు లభిస్తున్న స్పందన చూసి సహించలేకపోయారని అన్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడుతున్నారని పయ్యావుల విమర్శించారు.

More Telugu News