Israel: ఇజ్రాయెల్‌లో దారుణ పరిస్థితులు.. ఈ వీడియో చూసి మీరు తట్టుకోగలరా?

  • ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీగా చేసిన హమాస్ ఉగ్రవాదులు
  • తిరగబడిన వారి 18 ఏళ్ల కుమార్తె హత్య
  • ఏడుస్తున్న పిల్లల్ని భయపెడుతున్న ఉగ్రవాది
  • చనిపోయిన అమ్మాయి స్వర్గానికి వెళ్లిందని చెప్పిన వైనం
  • వైరల్ అవుతున్న వీడియో
Israeli family is held hostage by Hamas terrorists

ఇజ్రాయెల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంపై దండెత్తిన హమాస్ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. సైనికులను, ప్రజలను బందీలుగా పట్టుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీధుల్లో తుపాకులతో హల్‌చల్ చేస్తూ కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ ఇజ్రాయెల్‌లో జరిగినట్టు తెలుస్తోంది.

ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు వారి 18 ఏళ్ల కుమార్తెను దారుణంగా చంపేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు. వారి 18 ఏళ్ల బిడ్డ మరో గదిలో శవమై ఉంది. అమ్మాయి వారికి ఎదురుతిరగడం వల్లే వారీ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సమీపంలో పేలుడు శబ్దాలు వినిపిస్తుండడంతో కుటుంబంలో చిన్నపిల్లలు ఏడుస్తుంటే.. వారికి కాపలాగా ఓ ఉగ్రవాది నోరు తెరవొద్దని హెచ్చరించాడు. అక్క మరణాన్ని తట్టుకోలేని ఆ ఐదేళ్ల చిన్నారి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఆమె తిరిగి వచ్చే అవకాశం లేదని మరో చిన్నారి అంటే.. రిలాక్స్ అంటూ ఉగ్రవాది పెద్దగా అరవడం వీడియోలో వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె స్వర్గానికి వెళ్లిందని వారితో చెప్పాడు. 

హనన్య నఫ్తాలీ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఈ ఇజ్రాయెల్ కుటుంబం బందీగా ఉందని, వారి ముఖాలను ఒకసారి చూడాలని ఆ యూజర్ అభ్యర్థించారు. ఆ కుటుంబం బతికి ఉందో, లేదో తెలియదని, కానీ ఇది హృదయవిదారకమని పేర్కొన్నారు. ఇది మానవత్వంపై జరుగుతున్న నేరమని, ప్రపంచనాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News