Afghanistan: ఒకే గంటలో ఆరు భూకంపాలు.. వణికిపోయిన ప్రజలు!

  • ఆఫ్ఘానిస్థాన్‌లోని హెరాత్ నగరంలో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు
  • 320 మందికి పైగా దుర్మరణం, వెయ్యి మందికి పైగా గాయాలు
  • పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి
Earthquakes rocks afghanistan 320 killed

శనివారం సంభవించిన వరుస భూకంపాలతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. హెరాత్ ప్రావిన్స్‌లో కేవలం గంట వ్యవవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఆ తర్వాత వరుసగా 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో భూకంపాలు కుదిపేశాయి. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి సమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. 

వరుస భూకంపాలతో స్థానికంగా పలు భవనాలు బీటలు వారాయి. ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వీధుల్లోకి వచ్చి నిలబడిపోయారు. భూకంపాల బారిన పడి మొత్తం 320 మంది మరణించినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నాయి. 

మరోవైపు, పపువా న్యూగినియాలో కూడా రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాలు కలకలం సృష్టించాయి. అయితే, నేపాల్‌లో కొన్ని భవంతులకు నష్టం వాటిల్లినా ప్రాణనష్టం మాత్రం సంభవించలేదు.

More Telugu News