Singareni Collieries Company: సింగరేణి ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ

Centre ministry of labour filed petition in high court about singareni election
  • ఈ నెలాఖరు లోపు సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ బెంచ్ తీర్పు
  • అసెంబ్లీ ఎన్నికల వరకు వాయిదా వేయాలని డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన సింగరేణి యాజమాన్యం
  • ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదన్న కేంద్ర కార్మిక శాఖ
  • తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరిన కేంద్రం
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ తరఫున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డీ శ్రీనివాసులు కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

గత నెల 27న సమావేశం ఏర్పాటు చేస్తే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని, తుది ఓటరు జాబితానూ ప్రకటించలేదని తెలిపింది. కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశామని, సింగరేణి యాజమాన్యం సహాయ నిరాకరణ వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నట్లు తెలిపింది. 

కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో అక్టోబర్ 5న విచారణ జరిగింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. మరోవైపు ఈ నెలాఖరు లోపు ఎన్నికలు పూర్తి చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.

ఈ తీర్పును సింగరేణి డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును నిలిపివేయాలని కోరింది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై తెలంగాణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరుతూ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ హైకోర్టుకు వెళ్లింది.
Singareni Collieries Company
BJP
BRS

More Telugu News