Panchumarthi Anuradha: ఢిల్లీలో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారు, అక్కడే ఉండి ప్రధానికి లేఖ రాయడమా?: పంచుమర్తి అనురాధ

  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ అబద్దాలు చెప్పారన్న ఎమ్మెల్సీ
  • 27 సార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్ సాధించిందేమిటో చెప్పాలని నిలదీత
  • గంజాయిని ధ్వంసం చేసినట్లు ఆధారాలు, ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్న
  • వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు, కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ ఢిల్లీ పర్యటన అంటూ ఆరోపణ
Panchumarthi Anuradha fires at YS Jagan

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఏపీ సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... జగన్ బిల్డప్ సీఎం అని, ఇప్పటి వరకు 27సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమిటో చెప్పాలన్నారు. ఏపీకి హోదా, విశాఖ రైల్వే జోన్, ట్రిపుల్ ఐటీ, నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్‌కు నిధులు వంటివి ఏం అయ్యాయి? అని నిలదీశారు. 

ఢిల్లీలో సదస్సులో జగన్ మాట్లాడుతూ 9,371 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశామని చెప్పారని, కానీ వాటికి రుజువులు ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయా? విజువల్స్ ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికడితే బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, కేరళ, డిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పట్టుబడ్డ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయని అక్కడి పోలీసు అధికారులు ఎందుకు చెబుతారు? అని నిలదీశారు. బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్‌ను పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫిడ్రిన్ మత్తు పదార్దం దొరికిందని, ఇది విజయవాడ భారతీ నగర్‌లోని కొరియర్ సంస్ధ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారన్నారు.

గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడిందని, ఇది వాస్తవం కాదా? చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్ని నాశనం చేసి గంజాయి పండించి వైసీపీ ఎమ్మెల్యేలు కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. సీఎం జగన్‌కు తన సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. రాయలసీమ ఎండిపోయేలా తీర్మానం చేస్తే కేంద్ర జలశక్తి మంత్రిని ఎందుకు కలవలేదన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో తన సోదరుడు అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు, తన కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ పర్యటన అని దుయ్యబట్టారు. అరకు కాఫీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని, జీ20 సదస్సులోను అరకు కాఫీని విదేశీ ప్రతినిధులకు బహుమతిగా ఇచ్చారన్నారు. అలాంటి ఉత్తరాంధ్రను గంజాయితో ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. పైగా కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. గంజాయికి బానిసలై తాడేపల్లిలో సీఎం ఇంటి పక్కనే రైల్వే ట్రాక్‌పై ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం ట్రైబ్యునల్ గురించి ప్రధాని మోదీని కలవకుండా, అక్కడే ఉండి లేఖ రాయడం విడ్డూరమన్నారు. జగన్ రాయలసీమ ప్రాంతానికి చేస్తోన్న అన్యాయం అందరికీ అర్థమవుతోందన్నారు.

More Telugu News