Navaneet kaur: బండారు... రోజాపై అలా మాట్లాడుతావా? ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకో: ఎంపీ నవనీత్ కౌర్

MP Navaneet kaur fires at Bandaru for comments on roja
  • బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా వీడియోలు పోస్ట్ చేసిన నవనీత్ కౌర్
  • మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? మహిళల గురించి ఇలాంటి మాటలా? అని నిలదీత
  • యావత్ దేశం రోజాకు అండగా ఉంటుందన్న నవనీత్ కౌర్
ఏపీ మంత్రి రోజాపై దారుణ వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ రాణా తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా తాను మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు. మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను చూశానని, రోజా పట్ల ఆయన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. తనకు ఏ పార్టీ వ్యక్తి అనేది సంబంధం లేదన్నారు. రోజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారని, సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా చేశారని, ఆమె పెద్దపెద్ద హీరోలతోను నటించారన్నారు.

కానీ రోజా రాజకీయాల్లోకి వచ్చాక ఆమె పట్ల ఇష్టారీతిన మాట్లాడే ధైర్యమా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో మీ భార్య, చెల్లి, కూతురు లేరా? అలాంటప్పుడు మహిళల గురించి అలా ఎలా మాట్లాడుతారు? అని బండారును ప్రశ్నించారు. ఒకవేళ రోజాకు సంబంధించి మీ వద్ద ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలన్నారు. మీకు రాజకీయాలు అవసరమా? లేక ఆంధ్రా, తెలంగాణలలోని మహిళల గౌరవం కావాలా? అని ప్రశ్నించారు. తాను లోక్ సభలో కూర్చున్నప్పుడు అందరూ తనకు మంచి గౌరవం ఇస్తారన్నారు. అలాంటిది రోజా గురించి అలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఓ తెలుగు అమ్మాయి రోజా గురించి మీరు ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా? అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకోండి అంటూ బండారుపై మండిపడ్డారు.

రోజాకు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచే కాదని, దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. అందరూ రోజా వెనుకే ఉంటారన్నారు. ఓ రాజకీయ నాయకురాలిగా,  ఓ మహిళగా, ఒక ఫైటర్‌గా తామంతా రోజా వెంటే ఉంటామన్నారు.
Navaneet kaur
Roja
bandaru satyanarayana murthy
Telugudesam
Amaravati

More Telugu News