Amit Shah: రానున్న రెండేళ్లలో వామపక్ష తీవ్రవాదం అన్నది లేకుండా చేస్తాం: అమిత్ షా

Amit Shah Says Left Extremism Will Be Eliminated From Country Within 2 Years
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష
  • నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హింస, మరణాలు తగ్గినట్లు వెల్లడి
  • నక్సలిజం మానవాళికి శాపమన్న కేంద్ర హోంమంత్రి
 ఈ రోజు ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గత ఏడాదిలో హింస, మరణాలు తగ్గినట్లు చెప్పారు. గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే 2022లో ఈ రకమైన కేసులు తక్కువగా నమోదయ్యాయన్నారు. నక్సలిజం మానవాళికి శాపమని, అందుకే దానిని అన్ని రూపాల్లోనూ నిర్మూలించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రానున్న రెండేళ్లలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని ఆయన అన్నారు. 

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో అంతకుముందు ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాదం సమస్యపై ఏపీ పోరాడుతోందన్నారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, తీసుకున్న చర్యలు, అభివృద్ధి, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం-సానుకూల ఫలితాలను అందించిందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మద్దతుతో ఏపీలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తమ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల ఏపీలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయన్నారు. తొలుత ఐదు జిల్లాలకు విస్తరించిన కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా వామపక్ష తీవ్రవాద బలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50కి తగ్గిందన్నారు.
Amit Shah
BJP
YS Jagan

More Telugu News