Pawan Kalyan: జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే ఎన్నికలకు వస్తున్నాం... ఇందులో సందేహమే లేదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan reiterates on alliance with TDP and BJP
  • ఎన్డీయే నుంచి జనసేన బయటికి వచ్చేసినట్టు ప్రచారం
  • బీజేపీ హైకమాండ్ తో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్న పవన్
  • ఇప్పటికీ టచ్ లోనే ఉన్నామని వెల్లడి
  • ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ప్రకటన చేశామని స్పష్టీకరణ

ఎన్డీయే నుంచి జనసేన బయటికి వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంపై జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఏదైనా కీలక అంశం ఉంటే తప్పక చెబుతామని వెల్లడించారు. 

తాము ఎన్డీయే నుంచి బయటికి వచ్చామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. మేం ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనే విషయం మా పార్టీ అంతర్గత విషయం... ఈ వ్యవహారంతో వైసీపీకి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. 

"మొన్న ఎన్డీయే కూటమి సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీనే ఉండాలన్న  నిర్ణయాన్ని మేం కూడా స్వాగతించాం. ఎన్డీయేకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. రాష్ట్రంలో ఓటు చీలకూడదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని ఆయన నివాసంలో కలిసినప్పుడు కూడా ఇదే చెప్పాను" అని పవన్ వెల్లడించారు. 

రాజకీయ పార్టీ ప్రథమ కర్తవ్యం ప్రజలకు న్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. నాది బహిరంగంగా మాట్లాడే మనస్తత్వం... బీజేపీ వారు మరో రకంగా వ్యక్తపరుస్తారు అంటూ పవన్ వివరణ ఇచ్చారు. 

"మొన్న పొత్తు ప్రకటన తర్వాత వైసీపీ పోతుంది అనే ఆనందం కలిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయి... అందులో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక, జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటుపై పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ వేశామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇందులో జనసేన బి.మహేందర్ రెడ్డి, కందుల దుర్గేష్, కె.గోవిందరావు, పాలవలస యశస్వి. టి.బొమ్మిడి నాయకర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. 

జనసేన పార్టీ సొంత ఆలోచన ఉన్న పార్టీ అని పవన్ స్పష్టం చేశారు. తమ పార్టీకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని అన్నారు. తమ పార్టీకి కూడా ఓటింగ్ షేర్ ఉందని వివరించారు. 


ప్రత్యేక పరిస్థితుల వల్లే టీడీపీతో పొత్తు ప్రకటన చేయాల్సి వచ్చింది

"నేను మంగళగిరిలోని మా పార్టీ  కార్యాలయానికి వచ్చేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరాను. కానీ అన్యాయంగా ఫ్లయిట్ ఆపేశారు. రోడ్డు మార్గంలో  వస్తుంటే  సరిహద్దుల వద్ద ఆపేశారు. ఈ పరిస్థితులు చూశాక తప్పనిసరి పరిస్థితుల్లో రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిశాక... నారా లోకేశ్, బాలకృష్ణ గార్ల సమక్షంలో పొత్తు ప్రకటన చేయాల్సి వచ్చింది. అసలు ఈ ప్రకటన ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. కానీ జీ20 సమావేశాల సమయంలో వైసీపీ ప్రభుత్వం కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేయించింది" అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News