Nara Lokesh: నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీకే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువ నిధులు వచ్చాయి: లోకేశ్

Lokesh press meet in Rajahmundry
  • టీడీపీకి రూ.27 కోట్లు వెళ్లాయంటూ ఆరోపణలు
  • నాడు వైసీపీకి రూ.100 కోట్లు వచ్చాయన్న లోకేశ్
  • అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని వైసీపీ నేతలను ప్రశ్నించిన వైనం
  • ఆధారాలు బయటపెట్టాలని సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. రూ.27 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చాయని ఆరోపణలు చేస్తున్నారని, తమ ఆడిటర్ అన్ని వివరాలు సమర్పించారని వెల్లడించారు. తమ పార్టీలో ప్రతి పైసాకు సంబంధించిన వివరాలను తాము ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. 

మిగతా పార్టీలతో పోల్చితే ఎన్నికల సంఘానికి డెడ్ లైన్ లోపలే అన్ని వివరాలు పంపించే పార్టీ తమదేనని ఉద్ఘాటించారు. ప్రతి మహానాడులోనూ కార్యకర్తల ముందు అకౌంట్ వివరాలు పంచుకుంటామని, ఇన్ కమ్ ట్యాక్స్ విభాగానికి, ఈసీకి తప్పనిసరిగా లావాదేవీల వివరాలు అందిస్తామని, అదీ మాకున్న చిత్తశుద్ధి అని లోకేశ్ స్పష్టం చేశారు. 

"ఇప్పుడు వాళ్లను అడుగుతున్నా... 2018-19 ఆర్థిక సంవత్సరంలో నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ, వైసీపీకే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అధిక నిధులు వచ్చాయి. నాకున్న అవగాహన మేరకు వారికి రూ.100 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడా పిచ్చి జగన్ ను, వైసీపీ నేతలను అడుగుతున్నా... ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు ఇచ్చారో మీరు ఆధారాలు బయటపెట్టండి" అని లోకేశ్ సవాల్ విసిరారు. 

త్వరలోనే టీడీపీ, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీ ఖరారు చేసే ఏ కార్యక్రమాన్నయినా ఇరు పార్టీలు కచ్చితంగా పాటిస్తాయని వెల్లడించారు.
Nara Lokesh
TDP
YSRCP
Rajahmundry
Andhra Pradesh

More Telugu News