Forrest Galante: పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకున్న అటవీ సాహసికుడు.. వీడియో ఇదిగో!

  • ప్రముఖ జీవశాస్త్రవేత్తకు ఫారెస్ట్ గలాంటేకు భయంకర అనుభవం
  • అటవీ ప్రాంతంలో ఓ మడుగులో ఉండగా పెద్దశబ్దంతో పడిన పిడుగు
  •  ఒక్కసారిగా కిందపడిన కెమెరా, భయంతో పరుగులు
wildlife adventurer Forrest Galante survives lightning strike

పిడుగుపాటుకు గురై మరణించిన వారు ఎందరో. తీవ్ర గాయాలతో బయటపడిన వారూ ఉన్నారు. కానీ, మన పక్కనే పిడుగు పడితే.. దాని నుంచి తప్పించుకుని బతికి బట్టకడితే.. నిజానికి ఈ అనుభవం చాలా భయంకరమైనది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, అటవీ సాహసికుడు ఫారెస్ట్ గలాంటేకి. అంతేకాదు, ఈ ఘటన మొత్తం అతడి కెమెరాలో రికార్డైంది. ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లాడ్స్‌ నగరంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిస్కవరీ ప్లస్, యానిమల్ ప్లానెట్ చానెళ్లలోనూ గలాంటే కార్యక్రమాలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్ కోసం ‘గేర్ రివ్యూ’ అనే కార్యక్రమం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

గలాంటే పిడుగుపాటు నుంచి క్షణాల్లో తప్పించుకున్న వీడియోను ఎడ్ క్రాసెంటీన్ అనే జర్నలిస్ట్ ఎక్స్‌లో పంచుకున్నారు. అటవీ ప్రాంతంలోని ఓ మడుగులో మోకాలి లోతులో నిల్చున్న గలాంటే జీపీఎస్ ప్రాముఖ్యతను వివరిస్తుండగా అకస్మాత్తుగా కెమెరా కిందపడిపోయింది. ఆ వెంటనే పెద్ద శబ్దం వినిపించింది. ఆయన నిల్చున్న వెనక పెద్ద వెలుగు కనిపించింది. దీంతో భయపడిపోయిన గలాంటే నీట్లోంచి ఒడ్డుకు పరిగెత్తుకొస్తూ.. నేను గాయపడ్డాను అంటూ అరవడం ఆ వీడియోలో వినిపించింది. అయితే, ఆ తర్వాత తాను బాగానే ఉన్నట్టు నెటిజన్లకు రిప్లై ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన వారు తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు నీటిలో ఉండకూడదని సలహా ఇస్తున్నారు. అంత పెద్ద పిడుగు నుంచి తప్పించుకున్నాడంటే అతడికింకా ఈ భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

More Telugu News