Syria: సిరియా మిలటరీ అకాడమీపై డ్రోన్ దాడి.. 100 మందికిపైగా మృతి

  • అకాడమీలో జరుగుతున్న ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్ వేడుకపై దాడి
  • మరో దాడిలో 9 మంది మృతి
  • ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించని ఉగ్ర సంస్థలు
At least 100 killed in drone attack on Syrian military academy

సిరియా మరోమారు రక్తమోడింది. సిరియన్ మిలటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికిపైగా మృతి చెందారు. ఇది ఉగ్ర సంస్థల పనేనని ప్రభుత్వ మీడియా ఆరోపించింది. మరోవైపు, కుర్దిష్ అధీనంలోని ఈశాన్య ప్రాంతంపై జరిగిన టర్కీ విమాన దాడుల్లో కనీసం 9 మంది మరణించారు. సెంట్రల్ సిటీ అయిన హామ్స్‌లోని మిలటరీ అకాడమీలో జరుగుతున్న ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్టు ఆర్మీ తెలిపింది. ఈ డ్రోన్ దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. మృతుల్లో 14 మంది పౌరులు కూడా ఉన్నట్టు పేర్కొంది. మరో 125 మంది వరకు గాయపడి ఉంటారని వివరించింది.

ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హసన్ అల్ ఘోబాష్ ప్రభుత్వ టీవీతో మాట్లాడుతూ.. ప్రాథమికంగా మృతుల సంఖ్య 80గా పేర్కొన్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, అంతే సంఖ్యలో చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. 240 మంది వరకు గాయపడినట్టు పేర్కొన్నారు. ఈ దాడికి ఏ సంస్థ ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు. 

పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్‌తో ఈ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. కాగా, టర్కీ-సిరియా మధ్య  2016-2019 మధ్య ఉత్తర సిరియాలోని కుర్దిష్ దళాలపై టర్కీ మూడు మేజర్ ఆపరేషన్స్ నిర్వహించింది. సిరియాలో ఈ ఘర్షణల కారణంగా 2011 నుంచి ఇప్పటివరకు 5 లక్షల మంది వరకు చనిపోయారు.  

More Telugu News