Nara Lokesh: చంద్రబాబు చేసిన పని జగన్‌కు నేరంలా కనిపిస్తోంది: నారా లోకేశ్ ట్వీట్

Nara Lokesh says chandrababu done crime according to ys jagan
  • గుజరాత్‌లో విజయవంతమైన 90:10 నుంచి ప్రేరణ పొందామన్న లోకేశ్
  • నిజాయతీపరుడైన చంద్రబాబును ఆధారాలు లేకుండానే జైలుకు పంపించారని ఆగ్రహం
  • యువతకు జగన్ అందించింది నిరుద్యోగం, డ్రగ్స్, చీప్ లిక్కర్ అని విమర్శలు
నిజాయతీగా ఆంధ్రప్రదేశ్ యువతకు నైపుణ్యం అందించేందుకు తమ పార్టీ అధినేత చంద్రబాబు కృషి చేశారని... ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో అది నేరంలా కనిపిస్తోందని, అందుకే చంద్రబాబును జైలుకు పంపించాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

గుజరాత్‌లో విజయవంతమైన 90:10 నుంచి ప్రేరణ పొంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అండగా ఉండేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ వైపు మొగ్గు చూపామని, కానీ జగన్‌కు ఇది నేరంగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌‌లో ఏం అక్రమాలు జరగకుండానే, సాక్ష్యాధారాలు లేకుండానే... నిజాయతీకి మారుపేరుగా ఉన్న చంద్రబాబును జైలుకు పంపించారన్నారు.

కానీ తాను సీఎంగా ఉన్న ఈ కాలంలో రాష్ట్ర యువతకు జగన్ అందించింది మాత్రం అధిక నిరుద్యోగ రేటు, విస్తృతంగా లభించే డ్రగ్స్, చీప్ లిక్కర్ అని, వీటితో యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను స్కిల్ డెవలప్‌మెంట్ గురించి ది ప్రింట్ ఇంటర్వ్యూలో కఠినమైన వాస్తవాలను చెప్పానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను లోకేశ్ తన ట్వీట్ లో పొందుపరిచారు.
Nara Lokesh
YS Jagan
Chandrababu

More Telugu News