Pawan Kalyan: జగన్, వైసీపీ నేతల్లారా... మీ బతుక్కి ఏ రోజైనా మీ జేబులోంచి ఒక్క రూపాయి తీశారా?: పవన్ కల్యాణ్

  • కైకలూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ వారాహి సభ
  • జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడడంపై విమర్శలు
  • జగన్ భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ.1200 కోట్లు దారిమళ్లించాడని ఆరోపణలు
  • రాష్ట్రంలో మద్య నిషేధం సాధ్యం కాదని వెల్లడి
Pawan Kalyan slams YCP leaders

ముదినేపల్లి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న తనను పంచాయతీ సర్పంచులు కలిశారని, జగన్ రూ.8,600 కోట్ల నిధులు దారిమళ్లించేశారని వాపోయారని వెల్లడించారు. 

ఈ జగన్ రూ.1200 కోట్ల మేర భవన నిర్మాణ కార్మికుల నిధి కూడా కాజేశాడని పవన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడని విమర్శించారు. భారతి సిమెంట్స్, సాక్షి మీడియా సంస్థను కలిగివున్న మీరు కూడా క్లాస్ వార్ గురించి మాట్లాడతారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

జగన్, వైసీపీ నేతల్లారా... మీ బతుక్కి ఏ రోజైనా మీ జేబులోంచి ఒక్క రూపాయి బయటికి తీశారా? ప్రజల కోసం ఖర్చు పెట్టారా? అని ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును కౌలు రైతుల కోసం ఖర్చు చేస్తున్నానని పవన్ కల్యాణ్ గర్వంగా చెప్పారు. 

ఇక మద్య నిషేధం అంశంపైనా పవన్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక... మహిళలు కోరుకున్న చోట మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు. మద్యం నిషేధించిన ప్రాంతంలో అధిక నిధులతో అభివృద్ధి పథకం చేపడతామని తెలిపారు. అంతేకాదు, తమ ప్రభుత్వం వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామని, మద్యం ధరలు తగ్గిస్తామని వివరించారు.

More Telugu News