CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం... మెనూ ఇదే!

  • తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం
  • రేపటి నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్
  • 23 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం
  • పోషకాలను అందించే వంటకాలకు మెనూలో ప్రాధాన్యత
CM Breakfast Scheme in Telangana govt schools will start from tomorrow

తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక మెనూ అమలు చేయనున్నారు. ఈ పథకం పేరు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్. రేపటి (అక్టోబరు 6) నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువుపై దృష్టి సారించగలరని, ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. 

వాస్తవానికి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను విజయదశమి నుంచి అమలు చేద్దామని నిర్ణయించినా, ఒకవేళ ఎన్నికల కోడ్ ముందే వస్తే, ఈ స్కీమ్ ప్రకటించడానికి నియమావళి ఒప్పుకోదని తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అందుకే, కాస్త ముందుగానే ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంతో తెలంగాణలోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. పాఠశాల ప్రారంభం కావడానికి 45 నిమిషాల ముందు ఈ అల్పాహారం అందించనున్నారు.


సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ మెనూ వివరాలు...

సోమవారం- ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం- పూరి, ఆలూ కుర్మా లేదా రవ్వతో చేసిన టమాటా బాత్, చట్నీ
బుధవారం- ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
గురువారం- తృణధాన్యాలతో చేసిన ఇడ్లీలు, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం- ఉగ్గాని/పోహా, తృణధాన్యాలతో చేసిన ఇడ్లీలు, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం- పొంగల్, సాంబార్ లేదా వెజ్ పులావ్, రైతా/ఆలూ కుర్మా

More Telugu News