Economy: పండుగలకు తోడు క్రికెట్ ప్రపంచ కప్.. భారత ఆర్థిక వ్యవస్థకు రూ.22,000 కోట్ల ఊతం!

Cricket World Cup May Add 22000 Crore To Indian Economy
  • నేటి నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచ కప్
  • ప్రయాణ, ఆతిథ్య రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుందన్న ఆర్థిక నిపుణులు
  • వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని వెల్లడి
క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.22,000 కోట్లు లేదా 2.6 బిలియన్ డాలర్ల మేర ఊతమిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు ప్రారంభమయ్యే ఐసీసీ ప్రపంచ కప్ నవంబర్ 19 వరకు కొనసాగనుంది. క్రికెట్ టోర్నీకి పండుగ సీజన్ కూడా తోడైంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు రూ.22,000 కోట్ల మేర సమకూరుతుందని వారు తెలిపారు.

ఈ టోర్నమెంట్ దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద సంఖ్యలో సందర్శకులను, అభిమానులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. 10 నగరాల్లో జరిగే మ్యాచ్‌లతో, ఇది ఎక్కువగా ప్రయాణ, ఆతిథ్యరంగాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆర్థికవేత్తలు జాహ్నవి ప్రభాకర్, అదితి గుప్తా బుధవారం ఒక నోట్‌లో పేర్కొన్నారు.

పండుగ సీజన్‌కు తోడు ఈ ఈవెంట్ కారణంగా చాలామంది సెంటిమెంటల్ క్రయవిక్రయాలను పెద్ద ఎత్తున జరుపుతారని వీరు పేర్కొన్నారు. కాబట్టి రిటైల్ రంగానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. టోర్నమెంట్ కోసం టెలివిజన్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా మొత్తం భారతీయ వీక్షకుల సంఖ్య 2019లో చూసిన 552 మిలియన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో టీవీ హక్కులు, స్పాన్సర్‌షిప్ రాబడి రూ.10,500 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల వరకు రావొచ్చునని అంచనా వేస్తున్నారు.

అయితే, ప్రపంచ కప్ వల్ల ఆదాయాలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్‌లైన్ టిక్కెట్లు, హోటల్ అద్దెలు పెరిగాయి. 10 నగరాల్లో అనధికారిక సెక్టార్‌లో సేవా ఛార్జీలు పండుగ సీజన్‌కు టోర్నమెంట్ తోడు కావడంతో గణనీయమైన పెరుగుదలను చూపగలవని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అక్టోబర్, నవంబర్‌లలో ద్రవ్యోల్బణం 0.15 శాతం నుంచి 0.25 శాతం మధ్య పెరగవచ్చునని తెలిపారు. టోర్నమెంట్ టిక్కెట్ల అమ్మకాలపై పన్ను వసూళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ ఉత్పత్తులు, సేవా పన్నులు తదితరాల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని తెలిపారు.
Economy
Cricket
India
government

More Telugu News