Telangana: తెలంగాణలో బీజేపీ దూకుడు.. బండి సంజయ్‌కు మళ్లీ కీలక బాధ్యతలు

  • 14 కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ నాయకత్వం
  • పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా బండి సంజయ్
  • వివేక్ వెంకటస్వామికి మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ బాధ్యతలు
Telangana BJP constitutes 14 committees for assembly elections

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా సీఎం కేసీఆర్‌‌ పై విమర్శలు చేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన బండి సంజయ్‌ కు కీలక బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా బండి సంజయ్ ను నియమించింది. 

ఇక పార్టీని వీడుతారన్న వార్తల నడుమ ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించింది. కన్వీనర్‌‌ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌‌ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను నియమించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చార్జిషీట్ కమిటీ ఛైర్మన్ గా మురళీధర్రావు, పోరాట కమిటీ ఛైర్మన్ గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించింది. ఇక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా కౌన్సిల్ సమావేశం జరగనుంది.

More Telugu News