Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్యాకేజీ గురించి కొన్నిరోజుల్లో వాస్తవాలు బయటకొస్తాయి: ద్వారంపూడి

dwarampudi hot comments on pawan kalyan
  • పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు
  • వైసీపీని తిట్టేందుకు, జైలుకెళ్లి పరామర్శించేందుకు కూడా డబ్బులు తీసుకున్నారని ఆరోపణ
  • టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున జనసేన ప్రభావం ఉండదని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఆయన డబ్బుల కోసం నటుడిగా రాజకీయాల్లోనూ నటిస్తున్నారని చురకలు అంటించారు. వైసీపీని తిట్టడానికి, జైలుకెళ్లి పరామర్శించడానికి.. ఇలా దేనికైనా డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. ఎక్కడికక్కడే ప్యాకేజీ అని, ఆయన ప్యాకేజీ గురించి మరికొన్ని రోజుల్లో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

హవాలా ద్వారా ఎంత డబ్బు దేశం దాటి వెళ్లింది? పవన్ ప్యాకేజీ సొమ్ము రష్యాకు వెళ్ళిందా? సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లిందా? అనే విషయాలు వెలుగు చూస్తాయన్నారు. రాజకీయంగా పవన్‌ను ఓ జోకర్‌లా చూస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా వంగవీటి రంగా ప్రభావం ఉన్న జిల్లా అని, అలాంటప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ప్రభావం ఇక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. జనసేనకు టీడీపీ వాళ్లే శత్రువులని, అలాగే టీడీపీకి జనసేనే శత్రువు అన్నారు. పైన లీడర్లు కలిసినంత ఈజీగా కింద క్యాడర్ కలవదన్నారు. దోచుకున్న డబ్బుతో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలనుకుంటున్నారని విమర్శించారు.
Pawan Kalyan
Dwarampudi Chandrasekhar Reddy
YSRCP
Telugudesam

More Telugu News