bandaru satyanarayana murthy: రోజా వల్ల జగన్‌కు, ఆయన పార్టీకే నష్టం: బండారు సత్యనారాయణమూర్తి

  • ఏపీలో రాజ్యాంగం అమలు కావడం లేదన్న బండారు  
  • చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే నిదర్శనమని వ్యాఖ్య
  • చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణ
  • జగన్ వంటి దోపిడీదారులు, అవినీతిపరులకు తలవంచేది లేదని స్పష్టీకరణ
  • భువనేశ్వరిని అనరాని మాటలు అన్నప్పుడు ఆమె మహిళ అని గుర్తుకు రాలేదా? అని ప్రశ్న
Bandaru Satyanarayana warns ys jagan

ఏపీలో రాజ్యాంగం అమలు కావడంలేదని, మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ కీలక నేతలపై కూడా జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులను అస్త్రాలుగా ప్రయోగిస్తోందన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ సర్కార్ తనపై పెట్టిన తప్పుడు కేసులో న్యాయదేవత తనకు అండగా నిలిచిందన్నారు. జాతిపిత గాంధీ మహాత్ముని జయంతి రోజే జగన్ దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడని, భయపెట్టి, అక్రమకేసులతో టీడీపీ నేతల గొంతులు నొక్కేయాలని చూస్తున్నాడన్నారు.

ఉరికంబం ఎక్కడానికైనా తాము సిద్ధంగానీ జగన్ లాంటి అవినీతిపరులు, దోపిడీదారులకు తలవంచేది లేదన్నారు. మంత్రిగా పని చేసినప్పుడు కూడా ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తన ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ పేరుతో తనను అదుపులోకి తీసుకొని, గుంటూరు తీసుకొచ్చారన్నారు. జగన్ ప్రభుత్వం ఉండేది మరో ఐదు నెలలేనన్నారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అకారణంగా అసెంబ్లీలో అనరాని మాటలు అన్నప్పుడు, జగన్‌కు, మంత్రులకు, వైసీపీ వారికి ఆమె మహిళ అని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తాను మాట్లాడిన దాన్ని తప్పుపట్టారు కానీ తన వ్యాఖ్యలకు ఎంతమంది ప్రజలు మద్ధతిచ్చారో, ముఖ్యంగా ఎందరు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు.

తన సంతకం ఫోర్జరీ అయితే అయినట్టు నేను చెప్పాలని, కానీ పోలీసులు చెప్పడం ఏమిటి? అని ప్రశ్నించారు. తన తరుపు న్యాయవాదులు అన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారని, తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. తాను రోజాపై మాట్లాడేటప్పుడు తనకు ఇద్దరు కూతుళ్లున్నారని కూడా చెప్పానని, మహిళల్ని ఎంతో గౌరవించే సంస్కృతి తమకు, తమ కుటుంబానికి ఉందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ దయవల్ల మహిళలపై మా పార్టీ నేతలకు అపారమైన గౌరవాభిమానాలు ఏర్పడ్డాయన్నారు.

కానీ మంత్రి స్థానంలో ఉండి రోజా మాట్లాడిన మాటల్ని తేలిగ్గా తీసుకోలేకపోయామన్నారు. ప్రభుత్వంలో ఇంకొందరు మహిళా మంత్రులున్నారు.. వారినెవరినీ తాము ఎప్పుడూ ఏమీ అనలేదని గుర్తు చేశారు. రోజాను జగన్మోహన్ కట్టడి చేయాలని, లేకుంటే ఆయనకు, ఆయన పార్టీకే నష్టమని హెచ్చరించారు.

More Telugu News