Chandrababu: బెయిల్, కస్టడీ పిటిషన్: చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది

SC lawyer pramod kumar arguments in acb court behalf of chandrababu
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదన్న న్యాయవాది
  • నాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి గుజరాత్ వెళ్లి ఈ స్కీమ్‌పై అధ్యయనం చేశారని వెల్లడి
  • సీమెన్స్ ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్న చంద్రబాబు న్యాయవాది
  • నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, కస్టడీలోకి తీసుకున్నారని వెల్లడి
  • కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని ప్రశ్న
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదన్నారు. నాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్‌కు వెళ్లి ఈ స్కీమ్‌పై అధ్యయం చేశారని, ఆ తర్వాత సీమెన్స్ ప్రాజెక్టుపై ఆమె ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. సీమన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదం పొందిందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిందని, కానీ ఆ కమిటీలో చంద్రబాబు లేరన్నారు.

ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారని, ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు పొడిగించిందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, ఆ తర్వాత విచారణ చేపట్టారన్నారు. సీఐడీ రెండు రోజులు ఆయనను కస్టడీకి తీసుకొని కూడా విచారించిందన్నారు. ఇప్పుడు మరోసారి కస్టడీ కోరుతున్నారని, అసలు ఆ అవసరం ఏముంది? అన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని, కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దుబే వాదనలు వినిపించారు. ఆ తర్వాత విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
Chandrababu
acb
cid
Andhra Pradesh

More Telugu News