Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ?

Akbaruddin Daughter Fatima Owaisi Political Entry soon
  • ఎంఐఎం చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళా నేత
  • లండన్ లో బారిష్టర్ చదువుతున్న ఫాతిమా ఓవైసీ
  • త్వరలోనే తిరిగి వచ్చి ప్రజాసేవ చేస్తుందని అక్బరుద్దీన్ ప్రకటన
పురుషాధిక్య పార్టీగా ముద్రపడిన ఎంఐఎంలోకి త్వరలో ఓ మహిళా నేత ఎంట్రీ ఇవ్వనున్నారట.. ప్రజాసేవలో భాగమయ్యేందుకు లండన్ నుంచి వచ్చేస్తున్నారట. ఆ మహిళ మరెవరో కాదు పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ.. ప్రస్తుతం బారిష్టర్ చదువు కోసం లండన్ లో ఉన్న ఫాతిమా త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తుందని అక్బరుద్దీన్ చెప్పారు. వచ్చాక ప్రజాసేవలో పార్టీ తరఫున పాల్గొంటుందని వివరించారు. సోమవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి అక్బరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లండన్ నుంచి తన కూతురు ఫాతిమా తిరిగి వచ్చి ప్రజాసేవలో పాల్గొంటుందని తెలిపారు.

పార్టీపై పడిన పురుషాధిక్య ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం పార్టీ మహిళా నాయకురాలిని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా పాతబస్తీలో ఎంఐఎంకు మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రభావం చూపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపినట్లు ఎంఐఎం నేతలు భావిస్తున్నారు. 

దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే ఫాతిమా ఓవైసీని రాజకీయాల్లో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తద్వారా ఎంఐఎంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామనే సందేశాన్ని జనంలోకి పంపించాలన్నది పార్టీ లక్ష్యమని చెబుతున్నారు. కాగా, పార్టీలోకి ఫాతిమా ఎంట్రీ ఇవ్వగానే ఎమ్మెల్యేగా నిలబెడతారా లేక ఏదైనా నామినేటెడ్ పదవి అప్పగిస్తారా అనే విషయంపై ఎంఐఎం వర్గాల్లో స్పష్టత లేదు.
Akbaruddin Owaisi
Fatima Owaisi
MIM
Fatima Political Entry

More Telugu News