BRS: రాష్ట్రం వచ్చాక ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదు.. మేం చీటర్స్ కాదు.. ఫైటర్స్: కేటీఆర్​

  • ప్రధాని మోదీ విమర్శలకు కేటీఆర్ కౌంటర్
  • 2018లో బీఆర్ఎస్ తో పొత్తుకు బీజేపీనే ప్రయత్నించిందన్న మంత్రి
  • కేసీఆర్‌‌ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయని విమర్శ
We are fighters not Cheaters says KTR

ఎన్డీఏలో బీఆర్‌‌ఎస్‌ను చేర్చుకోవాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు ఆ అవసరం కూడా లేదన్నారు. ఇతర పార్టీల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా పట్టించుకోలేదన్నారు. తాము ఫైటర్స్‌.. చీటర్స్‌ కాదు అని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌‌ ట్వీట్ చేశారు. అవసరం అయితే బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్మణ్ చెప్పిన న్యూస్ క్లిప్పింగ్‌ను షేర్ చేశారు.

‘అనేక అభ్యర్థనలు వచ్చినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. నిజానికి బలవంతుడైన కేసీఆర్‌ గారిని ఓడించేందుకు విపక్షాలే తమ సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి ఏకతాటిపైకి వచ్చాయి. 2018లో బిగ్గెస్ట్ ఝూటా పార్టీ (బీజేపీ), దాని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ద్వారా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి కబరు పంపింది. తమ ఢిల్లీ పెద్దల ఆమోదం లేకుండానే ఈ ఆఫర్ వస్తుందా? మరుసటి నిమిషంలోనే బీఆర్ఎస్ ఆ ఆఫర్ ను పూర్తిగా తిరస్కరించింది. అసలు 105 అసెంబ్లీ సెగ్మెంట్లలో డిపాజిట్లు కూడా రాని పార్టీతో బీఆర్‌ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? సొంతంగా అధికారంలోకి వచ్చే బలం ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు ఏం అవసరం? కట్టు కథలు అల్లుతున్న రాజకీయ పర్యాటకులు ఇది తెలుసుకోవాలి. మేం చీటర్స్ కాదు.. ఫైటర్స్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News