Gold Man: ‘లివింగ్ స్టాట్యూ’ గిర్జేష్ గౌడ్‌పై కానిస్టేబుల్ దాష్టీకం.. పీకనొక్కుతూ ఈడ్చుకెళ్లే ప్రయత్నం!

  • లివింగ్ స్ట్యాట్యూ, గోల్డ్‌మ్యాన్‌గా ముంబై వాసులకు చిరపరిచితుడైన గిర్జేష్ గౌడ్
  • బాంద్రా బండ్‌స్టాండ్‌లో గిర్జేష్‌తో గొడవపడిన కానిస్టేబుల్
  • జనం అడ్డుకున్నా తోసుకుంటూ ఈడ్చుకెళ్లిన వైనం
  • కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్న నెటిజన్లు
Gold Man Assaulted by Cop At Bandra Bandstand

‘లివింగ్ స్టాట్యూ’.. ‘గోల్డ్‌మ్యాన్’ గా చిరపరితమైన గిర్జేష్‌ గౌడ్‌పై ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. జనం ఆపుతున్నాసరే కర్రతో అతడ్ని కొడుతూ మెడపట్టుకుని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశాడు. ముంబై బాంద్రాలోని బండ్‌స్టాండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనం జోక్యం చేసుకోవడంతో ఈ గొడవకు తెరపడింది. 

తనపై జరిగిన దాడి విషయాన్ని గిర్జేష్ తన ఇన్‌స్టా ఖాతా ’గోల్డీస్టాట్యూ’లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కానిస్టేబుల్ ఆ సమయంలో తాగి ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. మద్యం మత్తులోనే అతడలా చేశాడా? అన్నది దర్యాప్తులో తేలనుంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు గోల్డ్‌మ్యాన్ పేర్కొన్నాడు. 

మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ తొలుత తనపై కర్రతో దాడిచేశాడని, తాను ఆపేందుకు ప్రయత్నిస్తే పీకనొక్కుతూ లాక్కెళ్లాడని పేర్కొన్నాడు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెడతానని కూడా తనను బెదిరించాడని ఆరోపించాడు. తానో ఆర్టిస్టునని, ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేసి అందరి దృష్టికి తీసుకెళ్లాలని కోరాడు. ముంబై పోలీసులు, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులను ట్యాగ్ చేశాడు. వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ గొప్ప ఆర్టిస్టుపై కానిస్టేబుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News