Varla Ramaiah: సజ్జల భార్గవ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం: వర్ల రామయ్య

  • ఓ వీడియోను వైరల్ చేస్తున్నారన్న వర్ల రామయ్య
  • చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వీడియో ఉందని వెల్లడి
  • దీని వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా ఉన్నట్టు ఆరోపణ
Varla Ramaiah says TDP complains against Sajjala Bhargav Reddy to Cyber Crime dept

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్ట్ ద్వారా ఆయనపై తనకున్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలు చూపించుకున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. సీఐడీ చీఫ్ ను బెదిరించి చంద్రబాబునాయుడిని గత 25 రోజులుగా రాజమహేంద్రవరం జైల్లో ఉంచడం చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత తప్పు చేశాడు అనడానికి ఈ ప్రభుత్వం వద్ద, సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 

అయినా కూడా ఆయన తప్పు చేశాడని ప్రజల్ని నమ్మించడానికి జగన్ రెడ్డి అనుచరులు, ముఖ్యంగా ఆయన పార్టీకి చెందిన సజ్జల భార్గవ రెడ్డి, ఆయన నేతృత్వంలో పనిచేసే వైసీపీ సోషల్ మీడియా, ఐప్యాక్ సహకారంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

"వైసీపీ సోషల్ మీడియాలో యువతీ యువకుడి మధ్య జరిగే ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. దానిలో సదరు యువతి, యువకుడు మాట్లాడుకుంటున్నట్టు చిత్రీకరించిన వైసీపీ సోషల్ మీడియా, చంద్రబాబు తప్పు చేశాడు అనేలా వారి సంభాషణల్ని తయారు చేసింది. 

యువతకు చంద్రబాబు అన్యాయం చేశారన్నట్టు... వైసీపీ సోషల్ మీడియానే అభూత కల్పనలతో ఒక ఆడియోను సృష్టించి సోషల్ మీడియాలో దాన్ని నిస్సిగ్గుగా వైరల్ చేస్తున్నారు. నిరుద్యోగుల్లాగా ఇద్దర్ని నియమించి, వారు మాట్లాడుకున్నట్టుగా సంభాషణల్ని రికార్డ్ చేసి, చంద్రబాబు రూ.371 కోట్లు కొట్టేసినట్టు, యువతలో ఒక అభద్రతాభావం సృష్టించడం ఎంత దుర్మార్గం? 

వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుడు భార్గవ రెడ్డి పాల్పడిన ఈ చర్య రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రాజేయడం కాదా? రెండు వర్గాలు, రెండు కులాల మధ్య విద్వేషాలు పెంచడం కాదా? 

చంద్రబాబునాయుడు తప్పుచేసే వ్యక్తి కాదని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు.. ధర్నాలు .. దీక్షలు చేపడుతున్నారు. సత్యమేవ జయతే అని రాష్ట్రంతో పాటు, రాష్ట్రేతరంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలను పలుచన చేయడానికి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం ఎంతవరకు సబబని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా.  

వైసీపీ సోషల్ మీడియా పనిగట్టుకొని మా నాయకుడిపై చేస్తున్న విషప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాం. మేం ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవడానికి అక్కడున్న  సబ్ ఇన్స్ పెక్టర్ కాస్త భయపడ్డారు. ఆయన ముఖంలో ఆ భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. సజ్జల భార్గవరెడ్డిపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు జరపాలని సైబర్ క్రైమ్ పోలీసుల్ని కోరాం. 

వైసీపీ సోషల్ మీడియా చేసే ప్రచారం మేం చేస్తే ఊరుకుంటారా? మా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి .. బూతులమంత్రి కంటే ఎక్కువ మాట్లాడారా? .. మంత్రి రోజా, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడే దానికంటే బండారు అతిగా స్పందించారా? పోలీస్ శాఖ చట్ట బద్ధంగా నడుచుకోవాలి గానీ ఇలా వ్యవహరించడం సరైన పద్ధతికాదు. మేం ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. 

చంద్రబాబునాయుడిపై విషప్రచారం చేయడం సూర్యుడిపై ఉమ్మేయడమేనని తెలుసుకోండి. ఆయన్ని అక్రమంగా అరెస్ట్  చేయడం మొదలు.... అవినీతి మరకలు అంటించాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడమే. చంద్రబాబుని జైలుకు పంపిన మీ విధానం మీకే తిప్పికొట్టింది. ఎందుకు ఈ తప్పు  చేశారని ముఖ్యమంత్రిని ఆయన పార్టీ వారే నిలదీస్తున్నారు. 

పోలీస్ శాఖ మేం ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ భార్గవరెడ్డిని,  సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియోలో మాట్లాడినట్టు చెప్పుకుంటున్న సదరు యువతీ యువకుడిని కూడా వెంటనే అదుపు లోకి తీసుకొని విచారించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

More Telugu News