Bandaru Sathyanarayana Murthy: ఏపీ హైకోర్టులో బండారు పిటిషన్ పై విచారణ ఈ నెల 5కి వాయిదా

  • మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు అరెస్ట్
  • హైకోర్టును ఆశ్రయించిన బండారు
  • 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారంటూ పిటిషన్
  • పోలీసులు నోటీసులు ఇవ్వలేదన్న ప్రభుత్వ న్యాయవాదులు
  • బండారు ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
  • పోలీసుల అరెస్ట్ ప్రొసీజర్ పై కౌంటర్ దాఖలు చేయాలని బండారుకు స్పష్టీకరణ
AP High Court adjourns Bandaru petition hearing

ఏపీ మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే తన అరెస్ట్ అక్రమం అంటూ బండారు సత్యనారాయణమూర్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

రెండు కేసుల్లో 41ఏ కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారని, నోటీసులు ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ఇవాళ విచారణ సందర్భంగా బండారు తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే, పోలీసులు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. 

వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... బండారు తన పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

అదే సమయంలో, పోలీసుల అరెస్ట్ ప్రొసీజర్ పై కౌంటర్ దాఖలు చేయాలని బండారు తరఫు న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

More Telugu News