New Delhi: ఢిల్లీలో కలకలం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లపై పోలీసుల దాడి

  • న్యూస్‌ క్లిక్‌ పోర్టల్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు
  • విదేశీ నిధుల మోసం జరిగిందని సంస్థపై ఈడీ కేసు
  • పోర్టల్ కు చైనాతో సంబంధాలున్నాయని ఆరోపణ
Journalists linked to NewsClick raided by cops in Delhi and Noida and Ghaziabad

దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రముఖ న్యూస్ పోర్టల్‌ 'న్యూస్‌క్లిక్‌'కు చైనాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ కార్యాలయంతో పాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉగ్యోగులకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంది.

ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ సమాచారం ఆధారంగా  ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల మేర విదేశీ నిధుల మోసం జరిగిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. కాగా, చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌ లో  ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో కథనం ప్రచురించింది.

More Telugu News