Chandrababu: సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు పిటిషన్ పై విచారణ.. కేసు విచారణకు వస్తుందా? రాదా? అనే టెన్షన్!

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ
  • చిట్టచివరి కేసుగా, ఐటెం నెంబర్ 63గా లిస్ట్ అయిన కేసు
  • కేసును విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 
Supreme Court to hear Chandrababu quash petiotion today

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు లాయర్లు వాదించనున్నారు. ఈనాటి జాబితాలో చంద్రబాబు కేసు చిట్టచివరి కేసుగా, ఐటెం నెంబర్ 63గా లిస్ట్ అయింది. 

గత వారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే, వాదనలు విన్న తర్వాత చివరి క్షణంలో జస్టిస్ భట్టి 'నాట్ బిఫోర్ మీ' చెప్పారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హుటాహుటిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం తలుపు తట్టారు. దీంతో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్... చంద్రబాబుకు బెయిల్ కావాలని కోరుతున్నారా? అని ప్రశ్నించారు. అయితే, తాము బెయిల్ కోరడం లేదని, కేసును క్వాష్ చేయాలని కోరుతున్నామని చెప్పారు. అయితే ఆ మరుసటి రోజు నుంచి కోర్టుకు సెలవులు ఉండటంతో... విచారణను సీజేఐ ఈరోజుకు వాయిదా వేశారు. 

ఈరోజు ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈరోజు కోర్టులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. జాబితాలో ఈ కేసు చిట్టచివరన ఉండటంతో... ఈరోజు విచారణకు వస్తుందా? రాదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు.

More Telugu News