Cricket: ఆసియా గేమ్స్ తొలి పోరులోనే శతకంతో చరిత్రకెక్కిన యశస్వి జైస్వాల్

  • ఆసియా క్రీడల్లో నేపాల్ తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
  • ప్రత్యర్థికి 203 పరుగుల లక్ష్యం నిర్దేశించిన జట్టు
  • మల్టీ స్పోర్ట్ ఈవెంట్ లో శతకం చేసిన భారత పిన్న వయస్కుడిగా యశస్వి రికార్డు
Yashasvi Jaiswal becomes youngest T20i centurion for India to score a hundred in a multi sports event

ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు బంగారు పతకం గెలుచుకోగా.. ఇప్పుడు భారత పురుషుల జట్టు స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ రోజు నేపాల్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థికి భారత్‌ 203 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన  భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో వీరవిహారం చేశాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం సాధించి ఔటయ్యాడు. దాంతో, మల్టీ స్పోర్ట్ ఈవెంట్ టీ20 మ్యాచ్ లో శతకం సాధించిన భారత పిన్న వయస్కుడిగా అతను రికార్డు సాధించాడు.

అతడితోపాటు రింకూ సింగ్ (15 బంతుల్లో 37 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (25), శివం దూబె (25 నాటౌట్) కూడా రాణించారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (2), జితేశ్‌ శర్మ (5) విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర రెండు, సందీప్‌, సోంపాల్ చెరో వికెట్‌ తీశారు. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ జట్టు 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులతో ఎదురీదుతోంది. కాగా, ఈ మ్యాచ్ తో భారత ఆటగాళ్లు సాయి కిశోర్, జితేశ్ శర్మ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు.

More Telugu News