Agasara Nandini: స్వప్న బర్మన్ అనుచిత వ్యాఖ్యల పట్ల స్పందించిన తెలంగాణ అథ్లెట్ అగసర నందిని

  • చైనాలో ఆసియా క్రీడలు
  • మహిళల హెప్టాథ్లాన్ అంశంలో తెలంగాణ అమ్మాయి నందినికి కాంస్యం
  • కొద్దిలో పతకం చేజార్చుకున్న స్వప్న బర్మన్
  • ట్రాన్స్ జెండర్ కు పతకం కోల్పోయానని స్వప్న బర్మన్ వ్యాఖ్యలు
  • ఆధారాలు చూపించాలన్న నందిని
Telangana athlete Agasara Nandini reacts to Swapna Barman comments

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ అమ్మాయి అగసర నందిని హెప్టాథ్లాన్ క్రీడాంశంలో దేశానికి కాంస్యం అందించడం తెలిసిందే. అయితే ఇదే ఈవెంట్ లో మన దేశానికే చెందిన స్వప్న బర్మన్ త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. స్వల్ప తేడాతో నందిని కాంస్యం దక్కించుకుంది. దాంతో, ఓ ట్రాన్స్ జెండర్ కు తాను పతకం కోల్పోయానని స్వప్న బర్మన్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 

తాజాగా, ఈ అంశంపై అగసర నందిని తీవ్రంగా స్పందించింది. బర్మన్ వ్యాఖ్యలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేసింది. "ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టబోను. ఈ ఆసియా క్రీడల్లో నా తొలి అంతర్జాతీయ పతకం గెలిచాను. ఈ ఘట్టాన్ని ఎంతో ఆస్వాదించాలని అనుకున్నాను. కానీ ఆ ఆనందం లేకుండా పోయింది. ఆమె ఏదైనా చెప్పాలనుకుంటే నేను పోటీలో పాల్గొంటున్నప్పుడే చెప్పొచ్చు కదా. ఓ మహిళ అయ్యుండి సాటి మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా?" అంటూ నందిని ప్రశ్నించింది. 

తల్లికి అనారోగ్యం కారణంగా ఆసియా క్రీడల నుంచి తిరుగు ప్రయాణమైన అగసర నందిని ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. తను చేస్తున్న ఆరోపణలకు స్వప్న బర్మన్ ఆధారాలు చూపించాలని నందిని డిమాండ్ చేసింది. 

క్రీడల్లో రాణించి దేశానికి పతకాలు తీసుకురావాలని మాత్రమే తనకు తెలుసని, తాను ఇప్పుడు పతకాలు సాధిస్తుంటే విమర్శలు వస్తున్నాయని విచారం వ్యక్తం చేసింది. ఎవరైనా విజయవంతం అవుతుంటే, వాళ్లను కిందికి లాగే వాళ్లు కూడా ఉంటారని వాపోయింది. "ఆమె నన్ను అన్నందుకు బాధపడడంలేదు... ఏ మాత్రం ఆలోచించకుండా విదేశీ గడ్డపై దేశం పరువు తీసేసిందన్నదే నా బాధ" అని నందిని పేర్కొంది.

More Telugu News