Atchannaidu: టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 160 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి: అచ్చెన్న

  • మంగళగిరిలో సత్యమేవ జయతే పేరిట టీడీపీ నిరాహార దీక్ష
  • హాజరైన అచ్చెన్నాయుడు, ఎంఏ షరీఫ్, పట్టాభిరామ్
  • చంద్రబాబు తప్పు చేయలేదు, ఎవరినీ చేయనివ్వలేదన్న అచ్చెన్న
  • తప్పుచేశామని నిరూపిస్తే నడిరోడ్డుపై ఉరేసుకుంటామని వెల్లడి
Atchannaidu attend protest in Mangalagiri

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసగా గాంధీ జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపం పక్కన సత్యమేవ జయతే పేరుతో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి టీ.ఎన్.టి.యూసి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు దీక్షలో కూర్చున్నారు. 

ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం కార్మికులు సంఘాల నాయకులు దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. 

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబును ఎటువంటి ఆధారం లేని కేసులో అరెస్టు చేశారని మండిపడ్డారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు తప్పు చేయలేదు... ఎవరినీ చేయనివ్వలేదని పేర్కొన్నారు. 74 సంవత్సరాల వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. 

మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాలలో సత్యమేవ జయతే దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ గాంధేయ మార్గంలో నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని ప్రజలు దగ్గరగా చూస్తున్నారన్నారు. జగన్ ను 5 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబును జైలులో చూసి చాలా బాధ కలుగుతుందని చెప్పారు. 

టీడీపీ-జనసేన  కలిసి పోటీ చేస్తే 160 సీట్లుకు పైగా గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. మేము తప్పు చేయం... ఒకవేళ చేశామని నిరూపిస్తే నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామన్నారు. ఎన్నో పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. చంద్రబాబు బయట ఉంటే తమకు భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి జగన కుట్రపన్ని అక్రమ కేసుల్లో జైలుకు పంపారన్నారు. చంద్రబాబును అరెస్టుచేసి జగన్ తన పీకను తాను కోసుకున్నారని వ్యాఖ్యనించారు. 

అసలు రింగ్ రోడ్డే లేదు అవినీతి జరిగిందని కేసులు పెడుతున్నారని అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో జగన్ చేస్తున్నటువంటి పరిణామాలను ఎప్పుడు చూడలేదని విమర్శించారు.  ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో సౌండ్ చేశారని పోలీసులు కొందరి పై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ 70 దేశాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. రేపు సుప్రీంకోర్డులో న్యాయం జరుగుతుందన్నారు.

More Telugu News