CPI Ramakrishna: చంద్రబాబును అరెస్ట్ చేసి ఇన్ని రోజులవుతున్నా సీఐడీ అధికారులు ఆధారాల కోసం వెతుక్కుంటున్నారు: సీపీఐ రామకృష్ణ

  • విజయవాడలో కేశినేని భవన్ వద్ద సత్యమేవ జయతే కార్యక్రమం
  • హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 
  • ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్య  
  • మోదీ, అమిత్ షా అండతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపణ
CPI Ramakrishna talks about Chandrababu arrest

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. 

చంద్రబాబును అరెస్ట్ చేసి రోజులు గడుస్తున్నాయని, కానీ సీఐడీ అధికారులు ఇప్పటికీ ఆధారాల కోసం వెతుక్కుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఏపీలో సీఐడీ పేరు మార్చుకుంటే బాగుంటుందని, 'జేపీఎస్' (జగన్ ప్రైవేటు సైన్యం) అని పెట్టుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. 

అంతేకాదు, చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం పెద్దల హస్తం ఉందని నమ్ముతున్నామని రామకృష్ణ అన్నారు. మోదీ, అమిత్ షాల అండతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. కానీ, చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. గత నాలుగేళ్లుగా ఏపీలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. 

అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా విజయవాడలోని కేశినేని భవన్ వద్ద ఇవాళ సత్యమేవ జయతే దీక్ష జరిగింది. ఈ దీక్షకు హాజరైన సందర్భంగా రామకృష్ణ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News