Pawan Kalyan: అందుకే వైసీపీకి మద్దతు ఇవ్వలేకపోయాను: పవన్ కల్యాణ్

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో  పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర
  • మచిలీపట్నంలో పార్టీ సమావేశం
  • తనను ఒక్క కాపు కులానికే అంటగట్టొద్దని విజ్ఞప్తి
  • పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రిని అయిపోవాలన్న ఆలోచన లేదన్న పవన్ 
  • జగన్ ఎలాంటి వాడో తెలిశాకే అతడికి మద్దతు ఇవ్వలేకపోయానని స్పష్టీకరణ
Pawan Kalyan speech in Machilipatnam

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య నడయాడిన నేల ఇది అని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య వంటి మహనీయుడు ఆకలితో ప్రాణాలు విడిచాడని తెలిసి కడుపు తరుక్కుపోయిందని అన్నారు. దేశం కోసం పాటుపడిన ఆ సైనికుడ్ని ఎలాగూ కాపాడుకోలేకపోయాం, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలనే నా తపన, నా ప్రయత్నం అని పవన్ స్పష్టం చేశారు.

పవన్ ప్రసంగం హైలైట్స్...

  • కులాల ఐక్యత గురించి నేను మొత్తుకుంటుంటాను. ఒక్క కులం వల్ల అధికారం రాదు. నేను చాలా ఓపెన్ గా కులాల గురించి, మతాల గురించి ఎందుకు మాట్లాడగలనంటే... నేను ఒక సోషల్ డాక్టర్ లాగా సమస్యను చూస్తాను.
  • నా ఎత్తు, రంగు.. వీటిని మనం ఎలా సొంతంగా నిర్దేశించుకోలేమో, కులం కూడా అంతే. మనం కులాన్నించి తప్పించుకోలేం. మాతృభాష నుంచి తప్పించుకోలేం. మతాన్నుంచీ తప్పించుకోలేం. అవి జన్మతః వచ్చేస్తాయి. అయితే ఎంత కుత్సితంగా తయారై మాట్లాడతామనేది అది మనమీదనే ఆధారపడి ఉంటుంది.
  • వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ చాలా విశాల దృక్పథంతో ఆలోచిస్తుంది. ఇది తెలంగాణలో పుట్టినప్పటికీ దీన్ని ప్రాంతీయ పార్టీ అని చెప్పలేను. జనసేనకు విశ్వ దృష్టి ఉంది. దేశాన్ని దృష్టిలో ఉంచుకుని అవతరించిన పార్టీ ఇది.
  • నాకు గట్టి నమ్మకం ఉంది... ఏదో ఒక రోజున దేశమంతా జనసేన పార్టీ భావజాలమే వ్యాప్తి చెందుతుంది. ఈ మాట నేను చాలా ధైర్యంగా చెప్పగలను.
  • 2008 నుంచి చూస్తున్నా... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కులాల వారీగా సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సహజమే. కానీ కులాల వల్ల అభివృద్ధి అయితే ఎప్పటికీ జరగదు.
  • బందరు పోర్టుకు ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు. కులాలు, మతాలు దాటి వెళితేనే ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. 
  • దుబాయ్ వంటి అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో మూడింట రెండొంతుల మంది భారతీయులే ఉంటారు. అక్కడి ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా ఉంటారు. భారతీయుల శ్రమశక్తి కూడా దుబాయ్ వంటి దేశాల అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తోంది. 
  • నేను కాపు కులానికి చెందినవాడ్నని మొహమాటం లేకుండా చెప్పుకోగలను. కానీ ఒక్క కాపు ఓటు బ్యాంకునే దృష్టిలో ఉంచుకుంటే  గెలవడం సాధ్యమయ్యే పనేనా? కులం గురించి ఆలోచించేవాడు కుల నాయకుడు అవుతాడే తప్ప, దేశ క్షేమాన్ని కాంక్షించే దేశ నాయకుడు కాలేడు.
  • నేను కులాలు, మతాలకు అతీతంగా విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నప్పుడు, నన్ను కాపులకే పరిమితం చేయాలని చూడొద్దు. నన్ను కేవలం ఒక కులానికే అంటగట్టి, నన్ను ఎందుకు కుల నాయకుడ్ని చేస్తున్నారు? అని బాధ కలుగుతుంది.
  • నేనెప్పుడూ కులాన్ని చూసి స్నేహం చేయను. కొందరితో స్నేహాలు సహజంగా కుదిరాయంతే. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు ఏ కులాలు ఉంటాయో కూడా నాకు తెలియదు. ఇమ్మాన్యుయేల్, ధన్ రాజ్... నా స్నేహితులు. చిన్నప్పుడు వాళ్ల కులమేంటో  నాకు తెలియదు. ఈ మధ్యనే అర్థమైంది వాళ్లు ఎస్సీలని. నేనెప్పుడూ కులాలను వెదుక్కుని స్నేహం చేయలేదు.
  • మూడేళ్ల కిందట రాజమండ్రిలో కాపులను ఓ మాట అడిగాను. రాజకీయాల్లో పెద్దన్న పాత్ర వహించమని కోరాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో కాపులు అత్యధిక శాతం ఉన్నారు. కాపులు పెద్ద మనసుతో ఆలోచించగలిగి, అన్ని కులాలను కలుపుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పాదముద్రలు వేసినవాళ్లవుతారు. 
  • బహుజన్ సమాజ్ పార్టీనే తీసుకుంటే... ఐదారు ఎన్నికలు... అంటే 20 ఏళ్లు ఆ పార్టీ కష్టపడితే మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు.  
  • పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలనే అవివేకం కానీ, అంత పిచ్చి ఆలోచన కానీ నాకు లేదు.
  • 80వ దశకంలో అప్పటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన వెంటనే గెలిచారు. అందరికీ అలా జరగదు. 
  • నేనెందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందంటే... నాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాలకు ఆంధ్రులందరూ బాధపడ్డారు. ఇందులో ఆంధ్రులకు ఎక్కడా సంబంధం లేదు.. కానీ చెడ్డపేరు ఆంధ్రులకు వచ్చింది. ఆంధ్ర నాయకులు చేసిన తప్పుకు ఆంధ్ర జాతి మొత్తం దెబ్బతింది. ఇవాళ రాష్ట్రాన్ని కోల్పోయాం. రాజధాని లేదు... కంచె లేని చేనులాగా రాజధాని లేని రాష్ట్రమైపోయింది. మూడు రాజధానులు అని చెప్పుకుంటామా?
  • నేనెప్పుడూ లక్షలాదిమంది నా వెంట ఉన్నారని గొడవపెట్టుకోను... నేను దమ్ము ధైర్యంతో నిలబడగలనా అనేది ఆలోచించి గొడవపెట్టుకుంటా.
  • ఆనాడు నేను రాజధానికి 30 వేల ఎకరాలు ఎందుకని అన్నాను. హైదరాబాద్ మహానగరం కూడా రాత్రికి రాత్రి అభివృద్ధి జరగలేదు. ఇప్పటిదాకా కూడా మనం రాజధాని ఏదన్నది తేల్చుకోలేకపోయాం. కులాలను దృష్టిలో పెట్టుకుంటే ఇంతే.  
  • వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వరని అంటుంటారు. నాకేమీ వైసీపీ అంటే వ్యక్తిగత ద్వేషం లేదు. 
  • జగన్ అనే వ్యక్తిని హైదరాబాదులో ఉన్నప్పటి నుంచి చూసినవాడ్ని. అతనికి నేనెవరో తెలియకపోవచ్చు. అతడు టీనేజిలో ఉన్నప్పటినుంచి గమనిస్తున్నాను. అతడి ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉండేవాళ్లది దూకుడు స్వభావం. దాడి చేయగలిగే మనుషులు వాళ్లందరూ.
  • కడపలో ఒక ఎస్సైని లాకప్ సెల్ లో వేసిన వ్యక్తులు వీళ్లు. ఇవన్నీ చూశాను నేను. ఇలాంటి వాళ్ల భూదందాల వల్ల కూడా విసిగిపోయి తెలంగాణ వాదానికి అనుకూలంగా పరిస్థితులు దారితీశాయి.
  • ఇవన్నీ చూసి, రాష్ట్రానికి ఇతడు తగిన వ్యక్తి కాడని వేరే పార్టీలకు మద్దతు ఇచ్చాను. ప్రైవేటు సైన్యం వేసుకుని వచ్చి అందరినీ అణగదొక్కేస్తాం అంటే మొదటి గళం నాదే లేస్తుంది. నా దేశంలో నేనెందుకు భయపడాలి... అనేది చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన.
  • నాలాంటి కోట్లాది మంది కోసమే పార్టీ స్థాపించాను. వారికి అండగా ఉండడం కోసమే జనసేన ఆవిర్భవించింది.

More Telugu News