KTR: అవును... మాది కుటుంబ పాలనే... రైతులే మా కుటుంబం: కేటీఆర్

KTR counters PM Modi remarks
  • తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్న ప్రధాని మోదీ
  • కేసీఆర్ తెలంగాణ కుటుంబ సభ్యుడన్న కేటీఆర్
  • తమది గాంధీ వారసత్వమని వెల్లడి
  • బీజేపీకి గాంధీని చంపిన గాడ్సే వారసత్వమని విమర్శలు 
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. మేం కుటుంబ పాలన సాగిస్తున్నామని మోదీ అంటున్నారు... అవును... మాది కుటుంబ పాలనే... బీఆర్ఎస్ బరాబర్ వారసత్వ పార్టీనే... రైతులే మా కుటుంబం... ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్న కేసీఆర్ కచ్చితంగా తెలంగాణ కుటుంబ సభ్యుడే అని స్పష్టం చేశారు. 

సూర్యాపేట జిల్లాలో ఇవాళ కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను, దళిత బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమది గాంధీ వారసత్వమని అన్నారు. బీజేపీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వమని విమర్శించారు. కేసీఆర్ అభివృద్ది అంటే ఏంటో చూపిస్తుంటే, మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎందరో నాయకుల త్యాగఫలమే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.

 అటు, కాంగ్రెస్ పార్టీపైనా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి వారంటీ పూర్తయి 100 ఏళ్లు గడుస్తోందని, అలాంటి వారంటీ లేని పార్టీ గ్యారంటీలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారని కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు.
KTR
Narendra Modi
KCR
BRS
Telangana

More Telugu News