Lakshman: కేసీఆర్ కు మోదీ వచ్చినప్పుడే జ్వరం, జలుబు వస్తాయి: లక్ష్మణ్

  • మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ మాత్రం రాడన్న లక్ష్మణ్
  • కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని వ్యాఖ్య
  • మోదీ సభ విజయవంతం కావడంతో కేటీఆర్ కు పాలుపోవడం లేదని ఎద్దేవా
Lakshman fires on KCR

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని వస్తే సీఎం మమతా బెనర్జీ వంటి వారు కూడా స్వాగతం పలికేందుకు వస్తారని... కేసీఆర్ మాత్రం రాడని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ తలవంపులు తెస్తున్నారని మండిపడ్డారు. మోదీ సభ విజయవంతమయిందని... బీరు, బిర్యానీ కోసం కాకుండా మోదీ ప్రసంగాన్ని వినడం కోసమే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని చెప్పారు. సభ విజయవంతం కావడంతో కేటీఆర్ కు పాలుపోవడం లేదని... బిత్తరపోయి గత్తర చేస్తున్నారని విమర్శించారు. 

ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ మొత్తం తమ కుటుంబమే అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని, దళితుడు మీ కుటుంబ సభ్యుడు కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ మీ కుటుంబ సభ్యులేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, మద్దతు ధర అడిగిన రైతులు, పోడు భూముల కోసం పోరాడుతున్న గిరిజనులు మీ కుటుంబ సభ్యులు కాదా? అని ప్రశ్నించారు.

More Telugu News